లాభాల ఓపెనింగ్‌ నేడు?!

లాభాల ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 43 పాయింట్లు ఎగసి 11,140 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అయితే చైనా అధికారుల వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా ప్రభుత్వ అధికారులు, కమ్యూనిస్ట్ నేతల వీసాలపై వాషింగ్టన్‌ ప్రభుత్వం నియంత్రణలు విధించడంతో తిరిగి వాణిజ్య వివాదాలు తలెత్తవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

ఫార్మా షాక్‌- చివరికి నష్టాలు 
మంగళవారం విజయదశమి పర్వదినం సందర్భంగా మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నప్పటికీ చివరికి బోర్లా పడ్డాయి. సెన్సెక్స్‌ 141 పాయింట్లు క్షీణించి 37,532 వద్ద నిలవగా.. నిఫ్టీ 48 పాయింట్లు బలహీనపడి 11,126 వద్ద ముగిసింది. అయితే తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మిడ్‌సెషన్ కంటే ముందుగానే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. 37,919కు ఎగసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,234 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 37,480 వద్ద, నిఫ్టీ 11,113 వద్ద కనిష్టాలను సైతం చవిచూశాయి. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,081 పాయింట్ల వద్ద, తదుపరి 11,036 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,202 పాయింట్ల వద్ద, తదుపరి 11,279 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,495, 27,223 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,112, 28,457 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 494 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. మంగళవారం సెలవుకాగా.. గ శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 683 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 606 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.