ఫార్మా షాక్‌- చివరికి నష్టాలు!

ఫార్మా షాక్‌- చివరికి నష్టాలు!

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నప్పటికీ చివరికి బోర్లా పడ్డాయి. వెరసి సెన్సెక్స్‌ 141 పాయింట్లు క్షీణించి 37,532 వద్ద నిలవగా.. నిఫ్టీ 48 పాయింట్లు బలహీనపడి 11,126 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు తొలుత కొనుగోళ్లకు ఎగబడటంతో మిడ్‌సెషన్ కంటే ముందుగానే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. 37,919కు ఎగసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,234 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అయితే చివర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 37,480 వద్ద, నిఫ్టీ 11,113 వద్ద కనిష్టాలను సైతం చవిచూశాయి. కాగా.. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేయగా.. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది. 

మీడియా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఫార్మా రంగం 3.4 శాతం పతనంకాగా.. మెటల్‌, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, ఐటీ 1.2-0.6 మధ్య బలహీనపడ్డాయి. అయితే మీడియా 1.3 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 7.6 శాతం, జీ 5.6 శాతం చొప్పున జంప్‌చేయగా.. బ్రిటానియా, యాక్సిస్, నెస్లే, బజాజ్‌ ఆటో, టైటన్‌, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ, హీరో మోటో 4-0.5 శాతం మధ్య ఎగశాయి. అయితే బీపీసీఎల్‌ 5 శాతం పతనంకాగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్‌, సిప్లా, ఐటీసీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం 3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

అరబిందో బేర్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో శ్రీరామ్‌ ట్రాన్స్‌, సెయిల్‌, నాల్కో, కమిన్స్‌ ఇండియా, బెర్జర్‌ పెయింట్స్‌, జూబిలెంట్ ఫుడ్‌ 4.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క అరబిందో 20 శాతం కుప్పకూలగా.. గ్లెన్‌మార్క్‌, ఎన్‌సీసీ, పిరమల్‌, భెల్‌, కంకార్‌, అశోక్‌ లేలాండ్, ఎన్‌ఎండీసీ, హెచ్‌పీసీఎల్‌ 9.5-4 శాతం మధ్య పతనమయ్యాయి. ఇతర ఫార్మా కౌంటర్లలో లుపిన్‌, కేడిలా, సన్‌ ఫార్మా, బయోకాన్‌ 3.3-1.5 శాతం క్షీణించాయి.

చిన్న షేర్లు వీక్
మార్కెట్లు హుషారుగా ప్రారంభమై చివరికి తోకముడవడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.3-0.8 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1630 నష్టపోగా.. 895 లాభాలతో ముగిశాయి.