యస్‌ బ్యాంక్‌- జీ.. హైజంప్‌

యస్‌ బ్యాంక్‌- జీ.. హైజంప్‌

ఇటీవల నేలచూపులతో కదులుతున్న ప్రయివేట్‌ రంగ దిగ్గజాలు యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లు తాజాగా జోరందుకున్నాయి. విభిన్న కారణాలతో ఈ రెండు కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో ఈ రెండు కౌంటర్లూ కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. అయితే తొలుత జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్ అమ్మకాలతో డీలాపడటం గమనార్హం! వివరాలు చూద్దాం..

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
టెక్నాలజీ దిగ్గజాలు మూడు కంపెనీలో వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు వెలువడిన వార్తలు యస్ బ్యాంక్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తోపాటు.. మరో రెండు అత్యున్నత ఐటీ కంపెనీలు యస్‌ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు మీడియా పేర్కొంది. దీనిలో భాగంగా వ్యూహాత్మక వాటాదారు కోసం యస్‌ బ్యాంక్‌ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పీఈ కంపెనీలతోపాటు స్వదేశీ, విదేశీ దిగ్గజాలు బ్యాంకుపట్ల ఆసక్తిని చూపుతున్నట్లు యస్‌ బ్యాంక్‌ గత నెలలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం జంప్‌చేసి రూ. 46 వద్ద ట్రేడవుతోంది. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
కంపెనీ వాటాలో 90 శాతం వరకూ ప్రమోటర్లు తనఖా పెట్టినట్లు వెలువడిన వార్తలు తొలుత మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌కు షాక్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 14 శాతం పతనమైంది. రూ. 203 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. అయితే జీ.. తాజాగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించాక రీసెర్చ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ రూ. 265 టార్గెట్‌ ధరతో న్యూట్రల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. జీ ప్రమోటర్లు 90 శాతం వాటాను తనఖాలో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే మరోపక్క ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతోపాటు రూ. 416 టార్గెట్‌ ధరను ఇచ్చింది. బ్రాడ్‌క్యాస్టింగ్‌ రంగంలో ఇప్పటికీ జీ లాభదాయక కంపెనీగా నిలవడం, మీడియా పరిశ్రమతో పోలిస్తే షేరు విలువ తదితరాలను ఇందుకు పరిగణించినట్లు ఐడీఎఫ్‌సీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 253 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 256ను సైతం అధిగమించింది.