బీపీసీఎల్‌- ఎడిల్‌వీజ్‌- నష్టాల దెబ్బ

బీపీసీఎల్‌- ఎడిల్‌వీజ్‌- నష్టాల దెబ్బ

కంపెనీ విక్రయానికి బాటలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించినట్లు వెలువడిన వార్తలు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) కౌంటర్‌ను దెబ్బతీశాయి. కాగా.. మరోవైపు రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌.. కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు వెల్లడికావడంతో ఫైనాన్షియల్‌ రంగ సంస్థ ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం..

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌
ఇంధన రంగ పీఎస్‌యూ..  బీపీసీఎల్‌ను ప్రయివేటైజేషన్‌ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తద్వారా కంపెనీ విక్రయానికి పార్లమెంట్‌ అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండదని తెలుస్తోంది. వ్యూహాత్మక భాగస్వామికి కేంద్ర ప్రభుత్వం 53.3 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. విదేశీ దిగ్గజాలకు కంపెనీలో వాటా విక్రయం ద్వారా డిజిన్వెస్ట్‌మెంట్‌తోపాటు.. ఇంధన రిటైలింగ్‌లో పొటీకి తెరతీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీపీసీఎల్‌ షేరు 5 శాతం పతనమై రూ. 492 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 475 వరకూ దిగజారింది. 

Image result for edelweiss financial services

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
అనుబంధ సంస్థ ఈసీఎల్‌ ఫైనాన్స్‌కు చెందిన దీర్ఘకాలిక రుణ సౌకర్యాల రేటింగ్‌ను క్రిసిల్‌ AA నుంచి తాజాగా AA-కు డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలియజేసింది. అయితే ఈసీఎల్‌ స్వల్పకాలిక క్రెడిట్‌ రేటింగ్‌ను A1+గా కొనసాగించేందుకు నిర్ణయించినట్లు వివరించింది. కాగా.. సమయానుగుణ చెల్లింపులు, కంపెనీ పటిష్టతను ఈ రేటింగ్‌ సూచిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ షేరు 5 శాతం పతనమై రూ. 79 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 77 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.