అరబిందోకు షాక్- అశోక్‌ లేలాండ్‌ పతనం

అరబిందోకు షాక్- అశోక్‌ లేలాండ్‌ పతనం

ఉత్పత్తిని క్రమబద్ధీకరించేందుకు వీలుగా వివిధ ప్లాంట్లలో కార్యకలాపాలను కొద్ది రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించడంతో ఆటో రంగ దేశీ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క యూఎస్‌ఎఫ్‌డీఏ గతంలో జారీ చేసిన ఫామ్‌-483 వివరాలు వెల్లడయిన నేపథ్యంలో హెల్త్‌కేర్‌ రంగ హైదరాబాద్‌ కంపెనీ అరబిందో ఫార్మా లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం డీలాపడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

అశోక్‌ లేలాండ్‌ లిమిటెడ్‌
ఈ నెల(అక్టోబర్‌)లో ఉత్పత్తిని క్రమబద్ధీకరించేందుకుగాను వివిధ ప్లాంట్లలో 2-15 రోజుల మధ్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆటో రంగ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ తాజాగా తెలియజేసింది. తద్వారా కొన్ని ప్లాంట్లలో తాత్కాలికంగా ఉత్పత్తికి విఘాతం కలగనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అశోక్‌ లేలాండ్‌ షేరు 5.5 శాతం పతనమై రూ. 64 వద్ద ట్రేడవుతోంది. 

Image result for aurobindo pharma

అరబిందో ఫార్మా లిమిటెడ్‌
అరబిందో ఫార్మా లిమిటెడ్‌కు చెందిన తెలంగాణలోని యూనిట్‌లో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ గతంలో జారీ చేసిన ఫామ్‌-483 వివరాలు  వెల్లడైనట్లు మీడియా పేర్కొంది. మొత్తం 7 లోపాలకుగాను ఫామ్‌-483 జారీ అయినట్లు తెలుస్తోంది. ప్రమాణాలను అందుకోని తయారీ విధానాలపై యూఎస్‌ఎఫ్‌డీఏ స్పందించినట్లు తెలుస్తోంది. నియంత్రణ విధానాలు, డాక్యుమెంటేషన్, పరికరాల పరిశుభ్రత, నాణ్యతా నియంత్రణ అంశాలను ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి.సెప్టెంబర్‌ 19-27 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అరబిందో ఫార్మాషేరు 16 శాతంపైగా కుప్పకూలి రూ. 474 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 462 వద్ద దాదాపు ఐదేళ్ల కనిష్టాన్ని తాకింది.