కుప్పకూలిన గ్లెన్‌మార్క్‌- కంకార్‌

కుప్పకూలిన గ్లెన్‌మార్క్‌- కంకార్‌

హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డిలోగల ప్లాంటుకి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) హెచ్చరికలు జారీ చేసినట్లు వెలువడిన వార్తలు దేశీ హెల్త్‌కేర్‌ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్ కౌంటర్‌లో అమ్మకాలకు కారణమయ్యాయి. కాగా.. మరోపక్క రూ. 861 కోట్ల విలువైన కంపెనీ క్లెయిములను విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీఎఫ్‌టీ) తిరస్కరించే అవకాశమున్నట్లు వెలువడిన వార్తలు కంటెయినర్‌ కార్పొరేషన్‌(కంకార్‌) కౌంటర్‌ను దెబ్బతీశాయి. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో లాభాల మార్కెట్లోనూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌
బడ్డిలోగల తయారీ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ వెల్లడించింది. ఏప్రిల్‌ 15-20 మధ్య చేపట్టిన తనిఖీల ఆధారంగా తొలుత యూఎస్‌ఎఫ్‌డీఏ ఓఏఐ(OAI)ను జారీ చేసినట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గ్లెన్‌మార్క్ షేరు 9 శాతం పతనమై రూ. 287 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 285 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. కాగా.. యూఎస్‌ఎఫ్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాలను తొలగించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టనున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది. రెండు వారాల్లోగా ఇందుకు తగిన ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలియజేసింది. అయితే బడ్డి ప్లాంటుకు సంబంధించి తయారీ, విక్రయాలపై ప్రస్తుతం ఎలాంటి ప్రభావమూ ఉండబోదని వివరించింది. 

కంటెయిన్‌ కార్పొరేషన్‌
సర్వీస్‌ ఎక్స్‌పోర్ట్‌ పథకాల(ఎస్‌ఈఐఎస్‌)కు సంబంధించి కంపెనీ చేస్తున్న క్లెయిముల్లో రూ. 861 కోట్లమేర డీజీఎఫ్‌టీ తిరస్కరించే అవకాశమున్నట్లు వెలువడిన వార్తలు కంటెయినర్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలకు కారణమయ్యాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8 శాతం పతనమై రూ. 567 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 561 వరకూ జారింది. 2015-16 నుంచి 2018-19 మధ్య ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ రూ. 1014 కోట్లమేర ఎస్‌ఈఐఎస్‌ క్లెయిములను కోరుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో రూ. 861 కోట్ల క్లెయిములకు సంబంధించి ఎస్‌ఈఐఎస్ పథకాలకు అర్హమైనవికావంటూ తొలి పరిశీలనలో డీజీఎఫ్‌టీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి పరిశీలన తదుపరి వివరాలు తెలియనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.