ఆటుపోట్లతో..  సెన్సెక్స్‌ డబుల్‌

ఆటుపోట్లతో..  సెన్సెక్స్‌ డబుల్‌

స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. ప్రస్తుతం 231 పాయింట్లు ఎగసి 37,904కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు బలపడి 11,226 వద్ద ట్రేడవుతోంది. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో వారాంతాన పతనమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభంలో ఒడిదొడుకులను చవిచూశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేయగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. 

మీడియా పతనం
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌ 0.6-0.3 శాతం చొప్పున పుంజుకోగా.. మీడియా 2.2 శాతం క్షీణించిది. ఈ బాటలో ఫార్మా 1.3 శాతం, ఆటో 0.9 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 4 శాతం జంప్‌చేయగా.. బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, కొటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, నెస్లే, కోల్‌ ఇండియా, ఆర్‌ఐఎల్‌, వేదాంతా 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ 7.5 శాతం పతనంకాగా.. బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్, హీరోమోటో, అల్ట్రాటెక్‌, గ్రాసిమ్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, ఐషర్‌, ఎంఅండ్‌ఎం 3-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, యస్ బ్యాంక్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, నాల్కో, సీమెన్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ 6-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐబీ హౌసింగ్‌, కంకార్‌, గ్లెన్‌మార్క్‌, అరబిందో, అశోక్‌ లేలాండ్, ఎన్‌బీసీసీ, పిరమల్‌, ఉజ్జీవన్‌ 7-2.3 శాతం మధ్య పతనమయ్యాయి.   

చిన్న షేర్లు వీక్
మార్కెట్లు హుషారుగా కదులుతున్నప్పటికీ మధ్య, చిన్నతరహా కౌంటర్లు అటూఇటుగా ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.2 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 778 లాభపడగా.. 837 నష్టాలతో కదులుతున్నాయి.