ఉపాధి జోష్‌- యూఎస్‌ దూకుడు

ఉపాధి జోష్‌- యూఎస్‌ దూకుడు

వ్యవసాయేతర రంగంలో పేరోల్స్‌ 136000 పెరిగినట్లు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. దీనికితోడు సెప్టెంబర్‌లో నిరుద్యోగిత ఐదు దశాబ్దాల కనిష్టానికి చేరినట్లు తెలియజేసింది. అయితే గత ఆరు నెలల్లో తొలిసారి తయారీ రంగంలో పేరోల్స్‌ క్షీణించినట్లు పేర్కొంది. నిజానికి వ్యవసాయేతర రంగంలో 1.45 లక్షల పేరోల్స్‌ను విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో.. ఓవైపు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకోవచ్చన్న అంచనాలకు బ్రేక్‌ పడగా.. మరోపక్క ఇది సంబరపడదగ్గ వృద్ధికూడా కాదంటూ ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఇప్పటికే కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలకు బలాన్నిస్తుందని తెలియజేశారు.

ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు చివరి సెషన్‌లో కొనుగోళ్లకు ఎగబడినట్లు తెలియజేశారు. వెరసి శుక్రవారం డోజోన్స్‌ 373 పాయింట్లు(1.4 శాతం) బలపడి 26,574 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 64 పాయింట్లు(1.4 శాతం) ఎగసి 2,952 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 110 పాయింట్లు(1.4 శాతం) జంప్‌చేసి 7,982 వద్ద స్థిరపడింది. గత వారం నికరంగా డోజోన్స్‌ 0.9 శాతం, ఎస్‌అండ్‌పీ 0.3 శాతం చొప్పున నీరసించగా.. నాస్‌డాక్‌ 0.5 శాతం పుంజుకోవడం గమనార్హం!

వడ్డీ కోత చాన్స్‌
ఆర్థిక మందగమన సంకేతాలనిస్తూ గత వారం సర్వీసుల రంగ గణాంకాలు సైతం నీరసించడంతో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు నష్టాలకు చెక్‌ పెట్టి లాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే. తయారీ రంగం గత పదేళ్లలోనే కనిష్ట స్థాయికి చేరుకున్నట్లు సప్లై మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ గణాంకాలు మంగళవారం పేర్కొనగా.. నిరుద్యోగిత పెరుగుతున్నట్లు బుధవారం వెలువడిన గణాంకాలు తెలియజేశాయి. లేబర్‌ మార్కెట్‌ బలహీనపడుతున్నట్లు ఏడీపీ, మూడీస్‌ ఎనలిటిక్స్‌ పేర్కొన్నాయి. దీంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ నెలాఖరున చేపట్టనున్న పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను కనీసం పావు శాతం తగ్గించే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

యాపిల్‌ జోష్‌
11 సిరీస్‌ మోడళ్ల విడుదల నేపథ్యంలో ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ షేరు శుక్రవారం దాదాపు 3 శాతం జంప్‌చేసింది. 11 మోడల్‌ ఫోన్ల తయారీని 10 శాతం పెంచనున్నట్లు వెలువడిన వార్తలు ఇందుకు కారణమయ్యాయి. కాగా.. కంప్యూటర్‌ దిగ్గజం హ్యూలట్‌ ప్యాకార్డ్‌(హెచ్‌పీ) షేరు దాదాపు 10 శాతం కుప్పకూలింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిబ్బందిని 16 శాతం తగ్గించుకోనున్నట్లు తెలియజేయడంతో హెచ్‌పీ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

మిశ్రమం
శుక్రవారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే 1.1 శాతం, ఫ్రాన్స్‌ 0.9 శాతం, జర్మనీ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. సింగపూర్‌, తైవాన్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 0.6-0.2 శాతం మధ్య పుంజుకోగా.. జపాన్‌ 0.3 శాతం క్షీణించింది. ఇతర మార్కెట్లలో  చైనా, హాంకాంగ్‌ మార్కెట్లకు సెలవుకాగా.. కొరియా దాదాపు యథాతథంగా ట్రేడవుతోంది.