ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్టుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 7 పాయింట్లు బలపడి 11,213 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆర్థిక మాంద్య అంచనాలకు చెక్‌ పెడుతూ వ్యవసాయేతర రంగంలో ఉద్యోగాలు పెరగడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. అయితే తయారీ రంగంలో ఉపాధి గణాంకాలు నీరసించాయి. దీంతో ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో పతనమయ్యాయి. దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉన్న నేపథ్యంలో మార్కెట్లు నేడు కన్సాలిడేషన్‌ బాటలో కదలవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

రెపో కట్‌- మార్కెట్ పతనం
పలువురు ఊహించినట్లుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును 0.25 శాతంమేర తగ్గించిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటును 5.15 శాతానికి సవరించింది. అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు 0.4 శాతం కోతను అంచనా వేయగా.. ఆర్‌బీఐ నిర్ణయాలు వెలువడిన వెంటనే మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో తొలి నుంచీ హుషారుగా కదులుతున్న మార్కెట్లు లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించాయి. చివరికి సెన్సెక్స్‌ 434 పాయింట్లు పతనమై 37,673 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 139 పాయింట్లు కోల్పోయి 11,175 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,633 వద్ద, నిఫ్టీ 11,158 వద్ద కనిష్టాలను చవిచూశాయి. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,111 పాయింట్ల వద్ద, తదుపరి 11,050 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,250 పాయింట్ల వద్ద, తదుపరి 11,333 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,500, 27,250 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,250, 28,500 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 683 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 606 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 811 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు దాదాపు రూ. 863 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.