4 రోజుల్లో 1150 పాయింట్లు హుష్‌

4 రోజుల్లో 1150 పాయింట్లు హుష్‌

గత వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో  కుదేలయ్యాయి. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవుకాగా.. మిగిలిన నాలుగు రోజులూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో  మార్కెట్లు భారీగా(3 శాతం) నష్టపోయాయి. సెన్సెక్స్‌ నికరంగా 1149 పాయింట్లు పతనమైంది. 38,000 పాయింట్ల మైలురాయి దిగువన 37,673 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 338 పాయింట్లు కోల్పోయి 11,175 వద్ద స్థిరపడింది. వారాంతాన అంచనాలకు దగ్గరగా ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం కుదించింది. ప్రస్తుతం వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ఈ ఏడాదికి జీడీపీ వృద్ధిని ఆర్‌బీఐ తాజాగా 6.1 శాతానికి సవరించింది. ఇంతక్రితం 6.9 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. 

చిన్న షేర్లు కుదేల్‌
మార్కెట్లను మించుతూ మధ్య, చిన్నతరహా కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో గత వారం బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 552 పాయింట్లు(4 శాతం) తిరోగమించింది. 13,714 వద్ద ముగిసింది. ఇక స్మాల్‌ క్యాప్‌ సైతం 523 పాయింట్లు(4 శాతం) వెనకడుగుతో 12,809 వద్ద నిలిచింది. 

యస్‌ బ్యాంక్‌.. నో
బ్లూచిప్‌ కౌంటర్లలో గత వారం ఇండస్‌ఇండ్‌, యస్‌ బ్యాంక్‌, జీ నికరంగా 14 శాతం చొప్పున కుప్పకూలగా.. ఎస్‌బీఐ, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, వేదాంతా, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, యాక్సిస్‌, బ్రిటానియా, కొటక్‌ మహీంద్రా తదితరాలు 11-5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే బీపీసీఎల్‌ 10 శాతం జంప్‌చేయగా.. ఐవోసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, ఎంఅండ్‌ఎం 3.6-1.6 శాతం మధ్య పుంజుకున్నాయి.

మిడ్‌ క్యాప్స్‌లో
గత వారం మిడ్‌ క్యాప్స్‌లో ఐబీ హౌసింగ్‌ 37 శాతం కుప్పకూలగా.. దివాన్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఐబీ రియల్టీ, రిలయన్స్ కేపిటల్‌, ఎడిల్‌వీజ్‌, ఐబీ ఇంటిగ్రే, లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌, కాఫీ డే, శంకర బిల్డ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, డెల్టా కార్ప్‌ తదితరాలు 26-16 శాతం మధ్య పడిపోయాయి.  కాగా.. మరోవైపు అదానీ గ్రీన్‌, ఇన్ఫో ఎడ్జ్‌, అలెంబిక్‌ ఫార్మా, ఎంఆర్‌పీఎల్‌, బయోకాన్‌, ఐటీఐ, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌ఎండీసీ, కంకార్ తదితరాలు 13-4 శాతం మధ్య జంప్‌చేశాయి.