రెపో కట్‌- కుప్పకూలిన మార్కెట్

రెపో కట్‌- కుప్పకూలిన మార్కెట్

పలువురు ఊహించినట్లుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును 0.25 శాతంమేర తగ్గించిన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటును 5.15 శాతానికి సవరించింది. అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు 0.4 శాతం కోతను అంచనా వేయగా.. ఆర్‌బీఐ నిర్ణయాలు వెలువడిన వెంటనే మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో తొలి నుంచీ హుషారుగా కదులుతున్న మార్కెట్లు లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించాయి. చివరికి సెన్సెక్స్‌ 434 పాయింట్లు పతనమై 37,673 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 139 పాయింట్లు కోల్పోయి 11,175 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,633 వద్ద, నిఫ్టీ 11,158  వద్ద కనిష్టాలను చవిచూశాయి.

మీడియా, బ్యాంక్స్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలహీనపడగా.. మీడియా, బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, రియల్టీ 3.6-1.2 శాతం మధ్య క్షీణించాయి. ఐటీ మాత్రం 0.4 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో జీ, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటన్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ 6.4-2.75 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఓఎన్‌జీసీ, విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ 1-0.4 శాతం మధ్య లాభపడ్డాయి. 

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐబీ హౌసింగ్‌ 8 శాతం పతనంకాగా, జస్ట్‌ డయల్‌, సన్‌ టీవీ, యూబీఎల్‌, భారత్‌ ఫోర్జ్‌, డిష్‌ టీవీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 8-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, టొరంట్‌ ఫార్మా, అపోలో హాస్పిటల్స్‌, గోద్రెజ్‌ సీపీ, పిరమల్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు లాభాలను వీడి నష్టాలతో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.9 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1638 నష్టపోగా.. 976 మాత్రమే లాభాలతో నిలిచాయి. 

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 811 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 863 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. బుధవారం మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1299 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 1503 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.