ఈ మిడ్‌ క్యాప్స్‌ పతనంలో టాప్‌

ఈ మిడ్‌ క్యాప్స్‌ పతనంలో టాప్‌

ఆర్‌బీఐ క్రెడిట్‌ పాలసీ నిర్ణయాల ప్రకటన తదుపరి ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాట పట్టాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్లు పడిపోయి 37,557కు చేరగా.. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 11,171ను తాకింది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి ఈ  కౌంటర్లు భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో జస్ట్‌ డయల్‌ లిమిటెడ్‌, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌, ఐబీ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. 

జస్ట్‌ డయల్‌ లిమిటెడ్‌: ఈ లోకల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ కంపెనీ కౌంటర్లో అమ్మేవాళ్లు అధికమై ఎన్‌ఎస్ఈలో 7 శాతం కుప్పకూలింది. రూ. 614కు చేరింది. తొలుత రూ. 607 వరకూ నీరసించింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 90,600 షేర్లు కాగా.. చివరి సెషన్‌కల్లా 1.55 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ఫైనాన్షియల్‌ సేవల రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 7.5 శాతం పతనమైంది. రూ. 246కు చేరింది. తొలుత రూ. 242 వరకూ జారింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం18.56 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 22.66 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌: రియల్‌ ఎస్టేట్‌ రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.3 శాతం తిరోగమించింది. రూ. 271కు చేరింది. ఇంట్రాడేలో రూ. 267 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 12900 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 5500 షేర్లు ట్రేడయ్యాయి. 

ఐబీ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌: ఫైనాన్షియల్ సేవల రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమైంది. అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 111 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 37000 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 1000 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. 

ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌: మౌలిక సదుపాయాల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం క్షీణించింది. రూ. 40కు చేరింది. ఇంట్రాడేలో రూ. 40 దిగువన 52 వారాల కనిష్టానికి చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7.11 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 10.17 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.