స్పందన స్ఫూర్తి- అలెంబిక్‌.. భళా

స్పందన స్ఫూర్తి- అలెంబిక్‌.. భళా

బ్రోకింగ్‌ సంస్థ యాక్సిస్‌ కేపిటల్‌ బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో మైక్రోఫైనాన్స్‌ కంపెనీ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌ కౌంటర్ జోరందుకుంది. కాగా.. మరోపక్క సొరియాసిస్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే ఏఎన్‌డీఏకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి లభించినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌
మైక్రోఫైనాన్స్‌ కంపెనీ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ షేరు కొనుగోలుకి(బయ్‌) రేటింగ్‌ను రీసెర్చ్‌ సంస్థ యాక్సిస్ కేపిటల్‌ ప్రకటించింది. ఇందుకు మద్దతుగా షేరుకి రూ. 1200 టార్గెట్‌ ధరను ఇచ్చింది. వృద్ధికి అవకాశాలున్న గ్రామీణ ప్రాంతాలలో సేవలను విస్తరిస్తుండటంతో కంపెనీ పనితీరు మరింత మెరుగుపడగలదని యాక్సిస్‌ అభిప్రాయపడింది. పోటీ సంస్థలతో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సైతం తక్కువేనని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో స్పందన స్ఫూర్తి  షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 933 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 940 వరకూ ఎగసింది. 

Image result for alembic pharmaceuticals limited

అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌
సొరియాసిస్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే ఏఎన్‌డీఏ క్లోబెటసోల్‌ ప్రోపియనేట్‌ స్ప్రే 0.05%కు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి లభించినట్లు అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. గాల్డెమా లేబోరేటరీస్‌ ఔషధం క్లోబెక్స్‌ స్ప్రే ఔషధానికి ఇది జనరిక్‌ వెర్షన్‌ అంటూ కంపెనీ పేర్కొంది. అలియర్‌ డెర్మాస్యూటికల్స్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ ద్వారా అభివృద్ధి చేసిన ఈ ఔషధానికి 2.2 కోట్ల డాలర్ల మార్కెట్‌ ఉన్నట్లు అంచనాగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ షేరు 3.25 శాతం ఎగసి రూ. 543 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 563 వరకూ జంప్‌చేసింది. అలెంబిక్‌ ఫార్మాలో ప్రమోటర్లకు 72.97% వాటా ఉంది.