రెపో కట్‌- మార్కెట్లు కుదేల్‌

రెపో కట్‌- మార్కెట్లు కుదేల్‌

పలువురు ఊహించినట్లుగానే రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా రెపో రేటును 0.25 శాతంమేర తగ్గించిన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి.ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు పాలసీ సమావేశాలు నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటును 5.15 శాతానికి సవరించింది. అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు 0.4 శాతం కోతను అంచనా వేయగా.. ఆర్‌బీఐ నిర్ణయాలు వెలువడిన వెంటనే మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో తొలి నుంచీ హుషారుగా కదులుతున్న మార్కెట్లు లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 101 పాయింట్లు క్షీణించి 38,006కు చేరింది. ఇక నిఫ్టీ 32 పాయింట్లు బలహీనపడి 11,282 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 11,263 వరకూ నీరసించింది.

మిశ్రమంగా
ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1 శాతం చొప్పున క్షీణించగా.. ఐటీ, ఆటో, ఫార్మా 0.6-0.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, ఓఎన్‌జీసీ, విప్రో, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, హిందాల్కో, ఆర్‌ఐఎల్‌ టీసీఎస్‌,  టెక్‌ మహీంద్రా 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే జీ, బీపీసీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, గ్రాసిమ్, ఐవోసీ, యూపీఎల్‌, అల్ట్రాటెక్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో టొరంట్‌ ఫార్మా, ఉజ్జీవన్‌, అశోక్‌ లేలాండ్, సిప్లా, ఆయిల్‌ ఇండియా, గోద్రెజ్‌ సీపీ 3.5-1.7 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు ఐబీ హౌసింగ్‌ 7 శాతం పతనంకాగా, ఫెడరల్‌ బ్యాంక్‌, నాల్కో, కాల్గేట్‌ పామోలివ్‌, యూబీఎల్‌, ఐసీఐసీఐ ప్రు 3.2-2.2 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.2 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1026 లాభపడగా.. 1435 నష్టాలతో కదులుతున్నాయి.