ఫ్లాష్‌ఫ్లాష్‌- ఐదోసారి రెపో కట్‌

ఫ్లాష్‌ఫ్లాష్‌- ఐదోసారి రెపో కట్‌

మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో 0.25 శాతం కోత విధించింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. రివర్స్‌ రెపో సైతం ఈ మేరకు 4.90 శాతానికి వెనకడుగు వేసింది. ఇక ఎంఎస్‌ఎఫ్‌తోపాటు బ్యాంక్‌ రేటు 5.4 శాతానికి చేరింది. గత పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ.. తగ్గించిన వడ్డీ రేట్లను బ్యాంకులు వేగంగా కస్టమర్లకు అందించేందుకు వీలుగా రుణాలను రెపో రేటుకు అనుసంధానించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజా నిర్ణయంతో పాలసీ సమీక్షలలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌.. వరుసగా ఐదోసారి రెపో రేటు తగ్గింపును చేపట్టినట్లయ్యింది. ప్రస్తుత పాలసీ సమీక్షవరకూ చూస్తే ఆర్‌బీఐ ఈ ఏడాదిలో మొత్తం ఐదు కోతల ద్వారా రెపో రేటును 1.35 శాతంమేర తగ్గించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు పరపతి సమీక్షను చేపట్టిన ఎంపీసీ రేట్ల కోతకు ఏకగ్రీవంగా నిర్ణయించింది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను ఎంపీసీ 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) అంచనాలను 3.5-3.7 శాతంగా ఆర్‌బీఐ పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వరుసగా మూడోసారి పావు శాతం కోత పెట్టడం ద్వారా రెపో రేటును 5.75 శాతానికి చేర్చింది. తద్వారా 2010 సెప్టెంబర్‌ తరువాత మళ్లీ రెపో రేటు 6 శాతం దిగువకు చేరడం విశేషం!