జీ.. బోర్లా- హెచ్‌డీఎఫ్‌సీ ఖుషీ

జీ.. బోర్లా- హెచ్‌డీఎఫ్‌సీ ఖుషీ

విదేశీ రీసెర్చ్‌ కంపెనీ మోర్గాన్‌ స్టాన్లీ.. గతంలో షేరుచ్చిన టార్గెట్‌ ధరలో తాజాగా కోత పెట్టడంతో సుభాష్‌ చంద్ర గ్రూప్‌ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బిజినెస్‌ వృద్ధికి సంబంధించిన వివరాలు వెల్లడించడంతో మార్టిగేజ్‌ దిగ్గజం హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి జీ కౌంటర్‌ నష్టాలతో కళతప్పగా.. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

జీ ఎంటర్‌టైన్‌మెంట్
రుణ భారం తగ్గించుకునే అంశంలో ప్రమోటర్లకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగ కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ షేరుకి అండర్‌వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటిస్తున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా పేర్కొంది. అంతేకాకుండా షేరు టార్గెట్‌ ధరనను రూ. 370 నుంచి రూ. 248కు కుదిస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 242 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 237 వరకూ నీరసించింది. ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన రూ. 13400 కోట్ల నుంచి కంపెనీ రుణ భారం రూ. 6300 కోట్లకు తగ్గినట్లు తెలుస్తోంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, రుణ భారం తదితర సమస్యల కారణంగా ఏడాది కాలంలో షేరు విలువ సగానికి క్షీణించడం గమనార్హం! 

Image result for hdfc ltd

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ 
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పెట్టుబడుల విక్రయం ద్వారా రూ. 1632 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఇది 83 శాతం అధికంకాగా.. వీటిలో గృహ ఫైనాన్స్‌లో కొంతమేర వాటా విక్రయం ద్వారా ఆర్జించిన లాభం కలసి ఉన్నట్లు తెలియజేసింది. డివిడెండ్ల ద్వారా ఆదాయం రూ. 1074 కోట్లకు చేరగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి రూ. 865 కోట్లు లభించినట్లు తెలియజేసింది. ఈ కాలంలో రుణాల విడుదల సైతం 18 శాతం ఎగసి రూ. 7160 కోట్లను తాకినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం లాభపడి రూ. 2009 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2013 వరకూ పెరిగింది.