ఐఆర్‌సీటీసీ ఐపీవో సూపర్‌ సక్సెస్‌

ఐఆర్‌సీటీసీ ఐపీవో సూపర్‌ సక్సెస్‌

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) పబ్లిక్‌ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో గురువారం(3న) ముగిసిన ఇష్యూ ఏకంగా 111 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ సాధించింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 315-320కాగా.. తద్వారా కంపెనీ రూ. 645 కోట్లు సమకూర్చుకోవాలని భావించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఇష్యూ ధరలో రూ. 10 డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 12.6 శాతం వాటాకు సమానమైన 2.01 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 225 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. 2018 నుంచి చూస్తే.. రైల్వే రంగ కంపెనీలలో రైట్స్‌(RITES), రైల్‌ వికాస్‌ నిగమ్‌, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఇప్పటికే లిస్టయ్యాయి. ఈ బాటలో ఐఆర్‌సీటీసీ నాలుగో కంపెనీగా నిలవనుంది.

స్పందన ఇలా
పీఎస్‌యూ కంపెనీ ఐఆర్‌సీటీసీ ఐపీవోకి అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి(క్విబ్‌) 109 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా.. సంపన్న వర్గాల(నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌) నుంచి 354 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్లు 14 రెట్లు, కంపెనీ ఉద్యోగులు 6 రెట్లు అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. 

కంపెనీ వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ(సీపీఎస్‌ఈ) ఐఆర్‌సీటీసీ. ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. రైల్వే శాఖ నిర్వహణలో నడుస్తోంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న కంపెనీగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ప్రసిద్ధిచెందింది. నెలకు సగటున 25-28 మిలియన్‌ లావాదేవీలు నమోదవుతున్నాయి. ప్రధానంగా నాలుగు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఆదాయంలో ఇంటర్నెట్‌ టికెటింగ్ ద్వారా 12 శాతం లభిస్తుండగా, కేటరింగ్‌ బిజినెస్‌ ద్వారా 55 శాతం సాధిస్తోంది. ఈ బాటలో ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌(రైల్‌ నీర్‌) విభాగం 10 శాతం, ట్రావెల్‌, టూరిజం నుంచి 23 శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.