మార్కెట్ డౌన్‌.. ఈ షేర్లు జూమ్‌

మార్కెట్ డౌన్‌.. ఈ షేర్లు జూమ్‌

ఆర్థిక మాంద్య భయాలు, ప్రపంచ మార్కెట్ల క్షీణత వంటి అంశాల నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటలో కదులుతున్నాయి. అమెరికన్‌ ప్రెసిడెంట్ ట్రంప్‌పై దర్యాప్తు, వాణిజ్య వివాదాలు తదితర ప్రతికూల అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌, డిష్‌ టీవీ ఇండియా లిమిటెడ్‌, ఒరిస్సా మినరల్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌(ఓఎండీసీ), శ్రేఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌: సుభాష్‌ చంద్ర గ్రూప్‌లోని ఈ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లింది. రూ. 249కు చేరింది. ఇంట్రాడేలో రూ. 258ను సైతం తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 16.89 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 9.21 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌: రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి రంగంలోని ఈ గోద్రెజ్‌ గ్రూప్‌ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసింది. రూ. 1031కు చేరింది. ఇంట్రాడేలో రూ. 1054 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 44,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 16000 షేర్లు ట్రేడయ్యాయి.

డిష్‌ టీవీ ఇండియా లిమిటెడ్‌: జీ గ్రూప్‌నకు చెందిన ఈ కేబుల్‌ టీవీ ప్రసారాల కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8.5 శాతం ఎగసింది. రూ. 18కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 22.11 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 11.59 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఒరిస్సా మినరల్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ(ఓఎండీసీ): ప్రభుత్వ రంగ ఈ మైనింగ్‌ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 17 శాతం దూసుకెళ్లింది. రూ. 908కు చేరింది. ఇంట్రాడేలో రూ. 912ను తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 3900 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 12,300 షేర్లు ట్రేడయ్యాయి. 

శ్రేఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  ఫైనాన్స్ : ఫైనాన్షియల్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసింది. రూ. 8.3కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 77,400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 46,000 షేర్లు ట్రేడయ్యాయి.