వేదాంతా- కోల్‌ ఇండియా.. వీక్‌

వేదాంతా- కోల్‌ ఇండియా.. వీక్‌

షేరు టార్గెట్‌ ధరను విదేశీ రీసెర్చ్ సంస్థ సిటీ.. తాజాగా కుదించడంతో బిలియనీర్‌ అనిల్‌ అగర్వాల్‌ గ్రూప్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ కౌంటర్‌ డీలాపడింది. కాగా.. మరోపక్క వరదలు, తదితర కారణాలతో ఉత్పత్తి, విక్రయాలు క్షీణించినట్లు వెల్లడించడంతో మైనింగ్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజం కౌంటర్ సైతం నీరసించింది. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం...

వేదాంతా లిమిటెడ్‌
కంపెనీ షేరుకి గతంలో ఇచ్చిన కొనుగోలు(బయ్‌) రేటింగ్‌ను కొనసాగిస్తున్నప్పటికీ టార్గెట్‌ ధరలో కోత పెడుతున్నట్లు గ్లోబల్‌ రీసెర్చ్‌ కంపెనీ సిటీ తాజాగా పేర్కొంది. టార్గెట్‌ ధరను రూ. 200 నుంచి రూ. 180కు కుదించింది. అనుబంధ సంస్థ హిందుస్తాన్‌ జింక్‌కు చెందిన నగదు, డివిడెండ్‌ వల్ల కంపెనీ లబ్ది పొందనున్నట్లు సిటీ తెలియజేసింది. చమురు ఉత్పాదక ఆస్తులను విక్రయించడం ద్వారా కూడా కంపెనీకి అదనపు బలం లభించనున్నట్లు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వేదాంతా షేరు 2.5 శాతం నష్టంతో రూ. 148 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 146 దిగువకూ చేరింది.

Image result for coal india ltd

కోల్‌ ఇండియా లిమిటెడ్‌
కంపెనీకి చెందిన భారీ ఓపెన్‌ పిట్‌ మైనింగ్‌లలో ఒకటైన దీపికాను గత నెలలో వరదలు ముంచెత్తినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్‌ ఇండియా పేర్కొంది. ఏడాదికి 3 కోట్ల టన్నుల సామర్థ్యం కలిగిన దీపికా మైనింగ్‌లో ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు తెలియజేసింది. దీంతో సెప్టెంబర్‌లో మొత్తం ఉత్పత్తి 24 శాతంవరకూ తగ్గి 30.77 మిలియన్‌ టన్నులకు చేరినట్లు వెల్లడించింది. ఇదేవిధంగా విక్రయాలు సైతం 20 శాతం నీరసించి 35.18 మిలియన్ టన్నులకు పరిమితమైనట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కోల్‌ ఇండియా షేరు 2.5 శాతం క్షీణించి రూ. 189 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 186 వరకూ జారింది.