యస్ బ్యాంక్‌ బౌన్స్‌- టీవీఎస్‌ స్కిడ్‌

యస్ బ్యాంక్‌ బౌన్స్‌- టీవీఎస్‌ స్కిడ్‌

బ్యాంక్‌ ఫైనాన్షియల్‌, నిర్వహణ, అంతర్గత పరిస్థితులు పటిష్టంగా ఉన్నట్లు యాజమాన్యం పేర్కొన్న నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోవైపు సెప్టెంబర్‌ నెలలో అమ్మకాలు నీరసించడంతో ఆటో రంగ దేశీ దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తుతున్నాయి. వెరసి యస్‌ బ్యాంక్‌ షేరు రివ్వున దూసుకెళ్లగా.. టీవీఎస్‌ మోటార్‌ షేరు నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

యస్ బ్యాంక్‌ లిమిటెడ్‌
బ్యాంక్‌ ఫైనాన్షియల్‌, నిర్వహణ, అంతర్గత పరిస్థితులు పటిష్టంగా ఉన్నట్లు యస్ బ్యాంక్‌ యాజమాన్యం తాజాగా పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా లిక్విడిటీ పరిస్థితులు సైతం మెరుగ్గా ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 28 శాతం దూసుకెళ్లి రూ. 41 వద్ద ట్రేడవుతోంది. కాగా.. మంగళవారం తనఖా షేర్లను ఇన్‌స్టిట్యూషన్స్‌ విక్రయించడంతో రూ. 29 వద్ద యస్‌ బ్యాంక్‌ షేరు ఆరేళ్ల కనిష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రమోటర్ రాణా కపూర్‌, తదితరులు 2.16 శాతం వాటాను విక్రయించడంతో బ్యాంకులో వాటా 4.72 శాతానికి పరిమితమైనట్లు యస్ బ్యాంక్‌ ఇప్పటికే తెలియజేసింది.

Image result for tvs motors

టీవీఎస్‌ మోటార్‌ 
సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు 26 శాతం క్షీణించి 3.09 లక్షలకు పరిమితమైనట్లు ఆటో రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తెలియజేసింది. అంతక్రితం 2018 సెప్టెంబర్‌లో 4,10,657 వాహనాలను విక్రయించింది. వీటిలో  మోటార్‌ సైకిళ్ల విక్రయాలు 1,23,921కాగా.. స్కూటర్లు 1,18,687 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. మొత్తం వాహన అమ్మకాలు 25 శాతంపైగా వెనకడుగు వేసి 3,15,912 యూనిట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీవీఎస్‌ మోటార్‌ షేరు దాదాపు 3 శాతం క్షీణించి రూ. 408 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 402 వరకూ నీరసించింది.