ప్రపంచ మార్కెట్లకు రెసిషన్‌ షాక్‌

ప్రపంచ మార్కెట్లకు రెసిషన్‌ షాక్‌

మళ్లీ ప్రపంచ ఆర్థిక  మాంద్య(రెసిషన్‌) భయాలు  తలెత్తుతున్నాయి. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండు రోజులపాటు బేర్‌మన్నాయి. బుధవారం డోజోన్స్‌ 494 పాయింట్లు(0.9 శాతం) పతనమై 26,079 వద్ద నిలవగా.. మంగళవారం సైతం ఇదే స్థాయిలో తిరోగమించింది. వెరసి రెండు రోజుల్లో డోజోన్స్‌ 838 పాయింట్లు కోల్పోయింది. ఇక బుధవారం ఎస్‌అండ్‌పీ 1.8 శాతం క్షీణించి 2,888 వద్ద నిలవగా.. నాస్‌డాక్‌ సైతం 1.6 శాతం నష్టపోయి 7,785 వద్ద స్థిరపడింది. సోమవారం మార్కెట్లకు అండగా నిలిచిన టెక్‌ దిగ్గజాలు యాపిల్‌ ఇంక్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, అల్ఫాబెట్‌ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తడం మార్కెట్లను దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బ్లూచిప్స్‌ 1.5 శాతం స్థాయిలో క్షీణించాయి.

గణాంకాల దెబ్బ
తయారీ రంగం గత పదేళ్లలోనే కనిష్ట స్థాయికి చేరుకున్నట్లు సప్లై మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ గణాంకాలు మంగళవారం పేర్కొనగా.. నిరుద్యోగిత పెరుగుతున్నట్లు బుధవారం వెలువడిన గణాంకాలు తెలియజేశాయి. లేబర్‌ మార్కెట్‌ బలహీనపడుతున్నట్లు ఏడీపీ, మూడీస్‌ ఎనలిటిక్స్‌ పేర్కొన్నాయి. సెప్టెంబర్లో అంచనాలకు దిగువన 135000 మందికే ఉపాధి లభించినట్లు తెలియజేశాయి. అంతక్రితం ఈ సంఖ్య 195000గా నమోదైంది. దీంతో మరోసారి ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

ఫోర్డ్‌, జీఎం వీక్‌
మూడో త్రైమాసికంలో వాహన అమ్మకాలు 5 శాతం నీరసించినట్లు తెలియజేయడంతో  ఆటో రంగ దిగ్గజాలు జనరల్‌ మోటార్స్‌, ఫోర్డ్‌ మోటార్‌ కో 4-3.5 శాతం చొప్పన పతనమయ్యాయి. బెర్న్‌స్టీన్‌ షేరుని డౌన్‌గ్రేడ్‌ చేయడంతో వీడియో గేమ్‌ సంస్థ యాక్టివిజన్‌ బ్లిజార్డ్ 1.2 శాతం వెనకడుగు వేసింది. అయితే మరోపక్క హోమ్‌ బిల్డర్‌ లెన్నార్ కార్ప్‌ దాదాపు 4 శాతం జంప్‌చేయగా.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ 1.5 శాతం పుంజుకుంది.

పతన బాటలో
యూరోపియన్‌ యూనియన్‌ దిగుమతులపై వాషింగ్టన్‌ ప్రభుత్వం తాజాగా టారిఫ్‌లను విధించనున్నట్లు వెలువడిన వార్తలు యూరోపియన్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. ఎయిర్‌బస్‌ విమానాలపై 10 శాతం, ఫ్రెంచ్‌ వైన్‌, స్కాటిష్‌, ఐరిష్‌ విస్కీలపై 25 శాతం చొప్పున డ్యూటీలు విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో బుధవారం యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 3 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. జపాన్‌ 2 శాతం క్షీణించగా.. సింగపూర్‌, తైవాన్‌, హాంకాంగ్‌, ఇండొనేసియా 1-0.5 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర మార్కెట్లలో చైనా, కొరియా మార్కెట్లకు సెలవుకాగా.. థాయ్‌లాండ్‌ స్వల్ప నష్టంతో కదులుతోంది. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 99ను అధిగమించగా.. 10 ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1.476 శాతానికి చేరాయి.