బ్యాంక్స్‌, రియల్టీ.. లబోదిబో

బ్యాంక్స్‌, రియల్టీ.. లబోదిబో

ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ రంగ కౌంటర్లలో అమ్మకాలు వెల్తువెత్తడంతో ఈ షేర్లు కుప్పకూలాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 621 పాయింట్లు పతనమై 38,046కు చేరగా.. నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 11,274 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 6 శాతం తిరోగమించగా.. రియల్టీ రంగం సైతం 6 శాతం వెనకడుగు వేసింది. ఇక ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3 శాతం నష్టపోయింది. 

కుదేల్‌
పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లలో ఇండియన్‌, జేఅండ్‌కే, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, యూనియన్, బీవోబీ, అలహాబాద్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓబీసీ, కెనరా, సిండికేట్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ 8.4-1.4 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, ఒబెరాయ్‌, శోభా, ప్రెస్టేజ్‌, సన్‌ టెక్‌, ఫీనిక్స్‌ 8-2 శాతం మధ్య క్షీణించాయి. ప్రయివేట్‌ బ్యాంక్‌ కౌంటర్లలో యస్‌ బ్యాంక్‌ 26 శాతం పడిపోగా.. ఆర్‌బీఎల్‌, ఇండస్‌ఇండ్, ఫెడరల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, యాక్సిస్‌, సెంచురీ యూనియన్, ఐసీఐసీఐ 16-2.5 శాతం మధ్య కుప్పకూలాయి.