నష్టాలు వీడని ఇండస్‌ఇండ్‌

నష్టాలు వీడని ఇండస్‌ఇండ్‌

ఇటీవల నేలచూపులతో కదులుతున్న ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు విముఖత చూపతుండటంతో ప్రస్తుతం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌  షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 1318 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1304 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. వెరసి ఆగస్ట్‌ 26న నమోదైన 52 వారాల కనిష్టం రూ. 1267కు చేరువైంది. గత మూడు రోజుల్లో ఈ కౌంటర్‌ 16 శాతం పతనమైంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్‌ఎఫ్‌సీ)కి ఇచ్చిన రుణాలు పూర్తి సెక్యూరిటీతో జారీ చేసినవేనంటూ వివరణ ఇచ్చినప్పటికీ ఇండస్‌ఇండ్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతుండటం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం..

3 రోజులుగా..
హెచ్‌ఎఫ్‌సీ, దాని అనుబంధ, సహచర సంస్థలకు ఇచ్చిన స్థూల రుణాలు బ్యాంకు మొత్తం లోన్‌బుక్‌లో 0.35 శాతంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ పేర్కొంది. హెచ్‌ఎఫ్‌సీకి మంజూరు చేసిన రుణాలు పూర్తిస్థాయి కొలేటరల్‌గా తెలియజేసింది. వీటికి సంబంధించి బకాయిలు లేవని వివరించింది. ఒక హెచ్‌ఎఫ్‌సీకి ఇచ్చిన రుణాలపై ఇటీవల స్పెక్యులేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో వివరణ ఇచ్చినట్లు బ్యాంక్‌ తెలియజేసింది. ఒత్తిడిని ఎదుర్కొంటున్న రియల్‌ ఎస్టేట్‌, పవర్‌, టెలికం తదితర రంగాలకు ఎక్స్‌పోజర్‌ అధికంగా కలిగిన నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రుణాల నాణ్యత కొంతమేర బలహీనపడే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.