ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. సోమవారం(సెప్టెంబర్ 30న) ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 315-320కాగా.. గురువారం(అక్టోబర్ 3న) ముగియనుంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 12.6 శాతం వాటాకు సమానమైన 2.01 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 645 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే.. రూ. 2 లక్షల విలువకు మించకుండా ఏకమొత్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 నుంచి చూస్తే.. రైల్వే రంగ కంపెనీలలో రైట్స్(RITES), రైల్ వికాస్ నిగమ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఇప్పటికే లిస్టయ్యాయి. ఈ బాటలో ఐఆర్సీటీసీ నాలుగో కంపెనీగా నిలవనుంది.
కంపెనీ వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ(సీపీఎస్ఈ) ఐఆర్సీటీసీ. ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. రైల్వే శాఖ నిర్వహణలో నడుస్తోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న కంపెనీగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రసిద్ధిచెందింది. నెలకు సగటున 25-28 మిలియన్ లావాదేవీలు నమోదవుతున్నాయి. ప్రధానంగా నాలుగు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఆదాయంలో ఇంటర్నెట్ టికెటింగ్ ద్వారా 12 శాతం లభిస్తుండగా, కేటరింగ్ బిజినెస్ ద్వారా 55 శాతం సాధిస్తోంది. ఈ బాటలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్(రైల్ నీర్) విభాగం 10 శాతం, ట్రావెల్, టూరిజం నుంచి 23 శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది.
ఆర్థిక పనితీరు
గత మూడేళ్లలో ఐఆర్సీటీసీ ఆదాయం రూ. 1535 కోట్లు(2017), రూ. 1470 కోట్లు(2018), రూ. 1868 కోట్లు(2019)గా నమోదైంది. ఈ కాలంలో నిర్వహణ లాభం వరుసగా రూ. 312 కోట్లు, రూ. 273 కోట్లు, రూ. 372 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 20 శాతం స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా.. ఈ మూడేళ్లలో రూ. 229 కోట్లు, రూ. 220 కోట్లు, రూ. 272 కోట్లు చొప్పున నికర లాభం ఆర్జించింది. వెరసి గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 25 శాతం, నికర లాభం 23 శాతం చొప్పున పుంజుకున్నాయి. రూ. 17 ఈపీఎస్ సాధించింది. 19 పీఈలో షేర్లను ఆఫర్ చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇబిటా మార్జిన్లు, దాదాపు రుణరహిత కంపెనీకావడం, 26 శాతం రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్వోఈ) సాధించడం సానుకూల అంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే రైల్వే రంగంపైనే పూర్తిగా ఆధారపడటంతో కొంతమేర ప్రతికూలమని చెబుతున్నారు. భవిష్యత్లో కేటరింగ్, ఆన్లైన్ టికెటింగ్, డ్రింకింగ్ వాటర్ వంటి అంశాలలో ఇతర సంస్థలకు అవకాశం కల్పిస్తే.. కంపెనీ ఆధిపత్యానికి దెబ్బతగలవచ్చని భావిస్తున్నారు.
(ఐఆర్సీటీసీ ఐపీవోకు దరఖాస్తు చేయదలిస్తే ఇన్వెస్టర్లు స్టాక్ నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి. కంపెనీ వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే ఈ విశ్లేషణగా గమనించగలరు)