ఇక మార్కెట్లకు ఆర్‌బీఐ పుష్‌?!

ఇక మార్కెట్లకు ఆర్‌బీఐ పుష్‌?!

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రధానంగా రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ)వైపు దృష్టి సారించే అవకాశముంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన నాలుగో ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షను మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) చేపట్టనుంది. నిర్ణయాలను ఆర్‌బీఐ శుక్రవారం(అక్టోబర్‌ 4న) ప్రకటించనుంది. ఈసారి పాలసీ సమీక్షలోనూ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును మరోసారి తగ్గించే వీలున్నట్లు అధిక శాతం మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి మందగించడంతో ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును 0.25 శాతంమేర తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ ట్యాక్స్‌ను భారీగా తగ్గించిన సంగతి తెలిసిదే. ఈ నిర్ణయాలకు దన్నుగా ఆర్‌బీఐ సైతం వినియోగాన్ని పెంచడం కంటే పెట్టుబడులకు బూస్ట్‌నిచ్చే వ్యూహాలను అమలు చేయవచ్చని విశ్లేషకులు ఊహిస్తున్నారు. 

నాలుగోసారీ..
ఆగస్ట్‌లో నిర్వహించిన గత పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటులో 0.35 శాతం కోత పెట్టింది. దీంతో ప్రస్తుతం రెపో రేటు 5.4 శాతంగా అమలవుతోంది. దీంతో ఇప్పటివరకూ ఆర్‌బీఐ వరుసగా నాలుగు సార్లు రెపో రేటును కుదించింది. అంతక్రితం జూన్‌ పాలసీ సమీక్షలోనూ రెపో రేటును 0.25 శాతం తగ్గించడంతో 2010 సెప్టెంబర్‌ తరువాత 6 శాతం దిగువకు అంటే 5.75 శాతానికి చేరిన విషయం విదితమే.

Image result for retail inflation in india

ట్రేడింగ్‌ 4 రోజులే
గాంధీ జయంతి సందర్భంగా బుధవారం(అక్టోబర్‌ 2న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. వారం ఆరంభం నుంచీ సెప్టెంబర్‌ నెలలో వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో ఆటో కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ నెల 26వరకూ సాధారణ సగటుకంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదుకావడం గమనార్హం! ఇది ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇతర అంశాలూ కీలకమే
కొద్ది నెలలుగా కొనసాగుతున్న అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారు. అక్టోబర్‌ రెండో వారంలో ఈ రెండు దేశాల మధ్య వివాద పరిష్కార చర్చలు ప్రారభంకాగలవని తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌పై ఎన్నికల రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై డెమక్రట్లు చేపట్టనున్న దర్యాప్తు సైతం మార్కెట్లకు కీలకంకానున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు తదితర పలు అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని తెలియజేస్తున్నారు.