హోటల్‌ షేర్లకు జీఎస్‌టీ కిక్‌

హోటల్‌ షేర్లకు జీఎస్‌టీ కిక్‌

ఆతిథ్య రంగానికి ప్రోత్సాహాన్నిచ్చే బాటలో జీఎస్‌టీ కౌన్సిల్.. ఫైవ్‌ స్టార్‌, తదితర హోటళ్ల సర్వీసులు, రూమ్‌ టారిఫ్‌లపై పన్ను తగ్గించేందుకు నిర్ణయించడంతో హోటల్‌ రంగ కౌంటర్లకు మరోసారి డిమాండ్‌ పెరిగింది. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గింపు అంచనాలతో గత వారం సైతం హోటల్‌ రంగ కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లిన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం మరోసారి హోటళ్ల నిర్వాహక కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ షేర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వారాంతాన నిర్వహించిన సమావేశంలో హోటళ్ల గదులు, సేవలపై.. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను తగ్గించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయించడంతో ఇన్వెస్టర్లకు హషారొచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

పన్ను తగ్గింపు తీరిలా..
హోటల్‌ రంగానికి సంబంధించి జీఎస్‌టీ కౌన్సిల్‌ సవరించిన పన్ను వివరాల ప్రకారం రూ. 7500 టారిఫ్‌లకు ఎగువన గదుల అద్దెలపై జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. ఈ బాటలో రూ. 1000-7500 మధ్య రూమ్‌ టారిఫ్‌లపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్నులో కోత పడనుంది. ఇక రూ. 1000లోపు గదులపై పన్ను మినహాయించారు. కాగా.. ఔట్‌డోర్ కేటరింగ్‌పై ప్రస్తుతం 12 శాతంగా అమలవుతున్న జీఎస్‌టీని 5 శాతానికి కుదించినట్లు తెలుస్తోంది. దీంతో హోటల్‌ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి.

Image result for Star Hotel

జోరుగా హుషారుగా
ఆతిథ్య రంగానికి ఉపశమనాన్ని కల్పించేందుకు జీఎస్‌టీ రేట్లు తగ్గించనున్న అంచనాలతో పలు హోటల్‌ స్టాక్స్‌ జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో తాజ్‌ జీవీకే 5 శాతం జంప్‌చేసి రూ. 170 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 178 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. తాజ్‌ బ్రాండ్‌ దిగ్గజం ఇండియన్‌ హోటల్స్‌ 8.4 శాతం లాభపడి రూ. 162 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 163 వరకూ పుంజుకుంది. ఒబెరాయ్‌ బ్రాండ్‌ హోటళ్ల దిగ్గజం ఈఐహెచ్‌ లిమిటెడ్‌ 5.4 శాతం పురోగమించి రూ. 177కు చేరింది. తొలుత రూ. 178ను సైతం అధిగమించింది. ఇక ఈఐహెచ్‌ అసోసియేటెడ్‌ 3.4 శాతం ఎగసి రూ. 343కు చేరింది. ఇంట్రాడేలో రూ. 349 వరకూ పెరిగింది. 

52 వారాల గరిష్టం
ఇతర స్టాక్స్‌లో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్స్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 329 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 332 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌ షేరు 8 శాతం దూసుకెళ్లి ప్రస్తుతంరూ. 1491 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 1530 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఇక మహీంద్రా హాలిడేస్‌ 6.2 శాతం ఎగసి రూ. 362 వద్ద ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌(ఐటీడీసీ) 2 శాతం పుంజుకుని రూ. 269 వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీడీసీ తొలుత రూ. 275 వరకూ పెరిగింది.  

స్మాల్‌ క్యాప్స్‌ సైతం
ఆతిథ్య రంగ ఇతర కౌంటర్లలో రాయల్‌ ఆర్కిడ్‌ హోటల్స్‌ 10.5 శాతం దూసుకెళ్లి రూ. 91 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 94ను తాకింది. ఈ బాటలో ఓరియంటల్‌ హోటల్స్‌ 7.4 శాతం పెరిగి రూ. 42కు చేరగా.. ఇంట్రాడేలో రూ. 45ను దాటింది. ఇదే విధంగా లెమన్‌ ట్రీ హోటల్స్‌ 9 శాతం దూసుకెళ్లి రూ. 59 వద్ద ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లలో హోటల్‌ లీలా వెంచర్‌ 3.3 శాతం ఎగసి రూ. 8 వద్ద, ద బైక్‌ హాస్పిటాలిటీ 3.3 శాతం బలపడి రూ. 23.4 వద్ద కదులుతున్నాయి. హోటల్‌ లీలా ఇంట్రాడేలో రూ. 8.6కు చేరింది.