ట్యాక్స్‌ కట్‌- రూపాయికీ జోష్‌

ట్యాక్స్‌ కట్‌- రూపాయికీ జోష్‌

డాలరుతో మారకంలో వారాంతాన హుషారుగా ప్రారంభమైన దేశీ కరెన్సీ చివరికి లాభాలతో ముగిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ పన్నుల్లో తగ్గింపులను ప్రకటించడంతో స్టాక్‌ మార్కెట్లు గత పదేళ్లలో ఎరుగని విధంగా అత్యంత భారీగా ర్యాలీ చేశాయి. ఈ బాటలో రూపాయి సైతం జోరందుకుంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్ మార్కెట్లో 40 పైసలు బలపడి 70.94 వద్ద నిలిచింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 71 మార్క్‌ దిగువకు చేరింది. శుక్రవారం ట్రేడింగ్‌లో తొలుత 71.19 వద్ద సానుకూలంగా ప్రారంభమైన రూపాయి తదుపరి ఇంట్రాడేలో 70.68 వరకూ బలపడింది. ఇది ఇంట్రాడే గరిష్టంకాగా.. చివరికి 70.94 వద్ద స్థిరపడింది. కాగా.. గురువారం స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాలు నమోదైన నేపథ్యంలో రూపాయి ఒడిదొడుకుల మధ్య స్వల్ప వెనకడుగు వేసిన సంగతి తెలిసిదే. 10 పైసలు నీరసించి 71.34 వద్ద ముగిసింది. అయితే బుధవారం(18న) మాత్రం రూపాయి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ భారీగా లాభపడింది. 54 పైసలు జంప్‌చేసి 71.24 వద్ద స్థిరపడింది. ఇదే రోజు స్టాక్‌ మార్కెట్లు తొలుత నష్టపోయినప్పటికీ చివర్లో ఊపందుకోవడం గమనార్హం! 

తొలుత నేలచూపులే
చమురు ధరల షాక్‌తో ఈ వారం తొలి రెండు రోజుల్లో దేశీ కరెన్సీ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. డాలరుతో మారకంలో సోమవారం 68 పైసలు పతనమైన రూపాయి 71.60 వద్ద ముగిసింది. ఈ బాటలో మంగళవారం సైతం మరో 18 పైసలు క్షీణించి 71.78 వద్ద స్థిరపడింది. ప్రపంచ సరఫరాల్లో 5 శాతానికి సమానమైన సౌదీ అరామ్‌కో క్షేత్రాలపై డ్రోన్‌ దాడుల కారణంగా ముడిచమురు ధరలు సోమవారం హైజంప్‌ చేశాయి. తొలుత కొత్త చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 20 శాతం దూసుకెళ్లిన ధరలు చివరికి 15 శాతం లాభంతో ముగిశాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లతోపాటు.. దేశీ కరెన్సీకి సైతం సెగ తగిలింది.



Most Popular