ఒక్క కిక్‌తో లాభాల్లోకి!

ఒక్క కిక్‌తో లాభాల్లోకి!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వరాలతో వారాతాన స్టాక్‌ బుల్‌ కొమ్ము విసిరింది. దీంతో అంతక్రితం మూడు రోజులుగా భారీ నష్టాలతో పట్టు చిక్కించుకున్న స్టాక్‌ బేర్‌.. బేర్‌మంది. వెరసి గత వారం మార్కెట్లు నికరంగా లాభాలతో ముగిశాయి. ఒక్క రోజులోనే సెన్సెక్స్‌ 2,000 పాయింట్లు(5.3 శాతం) దూసుకెళ్లడంతో అంతకుముందు బుధవారం మినహా నమోదైన 1300 పాయింట్ల నష్టాలకు చెక్‌ పడింది. గత వారం నికరంగా సెన్సెక్స్‌ 630 పాయింట్లు(1.7 శాతం) లాభపడింది. 38,015 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 360 పాయింట్ల నష్టాలను పూడ్చుకోవడమేకాకుండా 198 పాయింట్లు(1.8 శాతం) బలపడింది. 11,274 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా.. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 38,000- 11,000 పాయింట్ల మార్క్‌లను అధిగమించి నిలిచాయి.

చిన్న షేర్లు సైతం..
మార్కెట్లు అందించిన ప్రోత్సాహంతో చిన్న షేర్లు సైతం జోరందుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3.3 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్‌ 1.5 శాతం పుంజుకుంది.

బ్లూచిప్స్‌ ఇలా
గత వారం దిగ్గజ కంపెనీల కౌంటర్లలో టైటన్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, ఐషర్, వేదాంతా, అల్ట్రాటెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎల్అండ్‌టీ 12-4 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 16 శాతం, జీ 14 శాతం చొప్పున కుప్పకూలగా.. టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఐబీ హౌసింగ్‌, ఇన్ఫోసిస్‌ 3.5 శాతం స్థాయిలో నీరసించాయి.

మిడ్‌ క్యాప్స్‌ జోరు
మిడ్ క్యాప్స్‌లో గత వారం ఐబీ ఇంటిగ్రేటెడ్‌, బాంబే బర్మా, పేజ్‌, ఎడిల్‌వీజ్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, వీఐపీ, కజారియా, ఎస్‌కేఎఫ్‌, డిమార్ట్‌, ఫినొలెక్స్‌ ఇండ, ఇండియన్‌ హోటల్స్‌ 27-12 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క ఎంఎంటీసీ, మన్‌పసంద్‌, ఇండోస్టార్‌, జిందాల్‌ స్టెయిన్‌, శంకర బిల్డ్‌, ఈక్విటాస్‌, దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ కేపిటల్‌, పీటీసి తదితరాలు 29-13 శాతం మధ్య పడిపోయాయి.