జోష్‌ ఈ వారం కొనసాగుతుందా?

జోష్‌ ఈ వారం కొనసాగుతుందా?

ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్లను డెరివేటివ్స్‌ ముగింపుతోపాటు.. విదేశీ అంశాలూ ప్రభావితం చేసే అవకాశముంది. అయితే వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్ పన్నులలో కోత పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చారు. దీంతో గత దశాబ్ద కాలంలోలేని విధంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు కళ్లు చెదిరే స్థాయిలో 5 శాతం ర్యాలీ చేశాయ్‌. దీంతో వారం మొదట్లో ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే తదుపరి మార్కెట్లు పలు ఇతర అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలియజేస్తున్నారు.

ఎఫ్‌అండ్‌వో, వర్షపాతం..
సెప్టెంబర్‌ నెల డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారం(26న) ముగియనుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను అక్టోబర్‌ సిరీస్‌కు రోలోవర్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మార్కెట్లలో కొంతమేర ఒడిదొడుకులకు అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవల రుతుపవనాలు జోరందుకుని దేశమంతటా విస్తరించాయి. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ వర్షపాతం దీర్ఘకాలిక సగటుకంటే 5 శాతం అధికంగా నమోదైంది. దేశీయంగా వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలు కీలకంకావడంతో ఇది అంతర్గతంగా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Image result for Crude oil

వాణిజ్య చర్చలు
వాణిజ్య వివాద పరిష్కార అంశాలపై ఈ వారాంతాన(26, 27న) అమెరికా, చైనా ప్రతినిధులు సమావేశంకానున్నారు. అక్టోబర్‌లో ప్రారంభంకానున్న అత్యున్నత అధికారిక చర్చలకు ముందుగా ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ సమావేశాలపై ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టే వీలుంది. మరోవైపు 23న యూఎస్, యూరోజోన్‌ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ బాటలో 26న ఏప్రిల్‌-జూన్(క్యూ2) జీడీపీ తుది గణాంకాలను యూఎస్‌ విడుదల చేయనుంది. 25న బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ గత పాలసీ మినిట్స్‌ విడుదల కానున్నాయి. గత సమీక్షలో స్వల్పకాలిక వడ్డీ రేటును యథాతథంగా -0.1 శాతంగానే అమలు చేసేందుకు బీవోజే నిర్ణయించింది.

ఇతర అంశాలూ కీలకమే
అంచనాలకు అనుగుణంగా ఫెడరల్‌ రిజర్వ్ వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించడంతో డాలరు బలపడింది. సౌదీ అరామ్‌కో క్షేత్రాలపై దాడుల కారణంగా ముడిచమురు ధరలు రివ్వున పైకెగశాయి. దీంతో రూపాయి ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. కాగా.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈక్విటీలలో నిరంతర అమ్మకాలు చేపడుతున్నారు. ఇలాంటి పలు అంశాలను సైతం ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని మార్కెట్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.