కుమ్మేసిన బుల్‌- 10 ఏళ్ల ర్యాలీ!

కుమ్మేసిన బుల్‌- 10 ఏళ్ల ర్యాలీ!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూకుడు చూపాయి. ఇంట్రాడేలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఏకంగా 2,000 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో గురువారం ముగింపు 36,000 నుంచి సెన్సెక్స్‌ ఒక్కసారిగా 38,000కు పోల్‌వాల్ట్‌ చేయగా.. నిఫ్టీ 10,700 స్థాయి నుంచి 11,380 పాయింట్లకు ఎగసింది. చివరికి ఇదే స్థాయిలో మార్కెట్లు నిలిచాయి. సెన్సెక్స్‌ 1921 పాయింట్లు జమ చేసుకుని 38,014 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 569 పాయింట్లు జంప్‌చేసి 11,274 వద్ద స్థిరపడింది. గత దశాబ్ద కాలంలో మార్కెట్లు ఒకే రోజు ఈ స్థాయిలో దూసుకెళ్లడం ఇదే తొలిసారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. 

చరిత్రలో తొలిసారి
తొలుత ఒక దశలో బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ)కు రూ. 7 లక్షల కోట్లమేర జమ అయ్యింది. వెరసి మార్కెట్‌ విలువ రూ. 1.45 ట్రిలియన్లను దాటేసింది! కాగా.. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీతోపాటు.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ చరిత్రలోనే తొలిసారి ఒకే రోజు అత్యధిక స్థాయిలో లాభపడ్డాయి. 

ఆటో, బ్యాంక్స్‌ దూకుడు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 10-2.5 శాతం మధ్య ఎగశాయంటే కొనుగోళ్ల వెల్లువను అర్ధం చేసుకోవచ్చు. రుపీ జోరందుకోవడంతో ఐటీ ఇండెక్స్‌ మాత్రమే స్వల్పంగా 0.2 శాతం నీరసించింది. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌ రంగాలు 10-6 శాతం చొప్పున దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, హీరో మోటో, ఇండస్‌ఇండ్, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌, బ్రిటానియా, టైటన్‌, ఎంఅండ్‌ఎం 13-9 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో జీ ఎంటర్‌ప్రైజెస్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా మాత్రమే అదికూడా 3-0.5 శాతం మధ్య నష్టపోయాయి. 

దివాన్‌ డీలా
ఇక డెరివేటివ్‌ కౌంటర్లలో అశోక్‌ లేలాండ్‌, ఎన్‌సీసీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, టీవీఎస్‌ మోటార్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, హావెల్స్‌, బిర్లాసాఫ్ట్‌ 19-12 శాతం మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు దివాన్‌ హౌసింగ్‌ 9 శాతం కుప్పకూలగా, జస్ట్‌ డయల్‌, రిలయన్స్‌ కేపిటల్‌, డాబర్‌, గ్లెన్‌మార్క్‌ 3-2 శాతం మధ్య నీరసించాయి. 

మిడ్‌ క్యాప్స్‌ జోరు
మార్కెట్ల బాటలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ భారీ డిమాండ్‌ నెలకొంది. దీంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 6 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్‌ సైతం 4 శాతం ఎగసింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1864 లాభపడగా.. 728 నష్టపోయాయి. రియల్టీ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్జేజ్‌, ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, బ్రిగేడ్‌ 8-2 శాతం మధ్య ఎగశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 892 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 646 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 959 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 780 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.