మార్కెట్ల హవా.. ఈ షేర్లు బోర్లా

మార్కెట్ల హవా.. ఈ షేర్లు బోర్లా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ వరాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఎక్కడలేని శక్తీ వచ్చింది. సెన్సెక్స్‌ 2000 పాయింట్లు దూసుకెళ్లి 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ సైతం 500 పాయింట్లు జంప్‌చేసి 11,000 పాయింట్ల కీలక మార్క్‌ను అవలీలగా దాటేసింది. ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ 10-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయినప్పటికీ  మరోపక్క ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు భారీస్థాయిలో అమ్మకాలకు దిగడం విశేషం! వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో పీటీసీ ఇండియా, దివాన్‌ హౌసింగ్‌, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, జీ మీడియా కార్పొరేషన్‌, అగర్వాల్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. 

పీటీసీ ఇండియా లిమిటెడ్‌: విద్యుత్‌ రంగ ఈ పీఎస్‌యూ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం పతనమైంది. రూ. 56.30కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 1.04 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 2.48 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ఎన్‌బీఎఫ్‌సీ రంగ ఈ కంపెనీ కౌంటర్లో కొనుగోలుదారులకంటే.. అమ్మేవాళ్లు అధికమై ఎన్‌ఎస్ఈలో 9 శాతం కుప్పకూలింది. రూ. 43.25కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 21.5 లక్షల షేర్లు కాగా.. చివరి సెషన్‌కల్లా 48.7 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌: కేఫ్‌ కాఫీ డే రిటైల్‌ షాపుల నిర్వాహక ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 65.2కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 3.71 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 1.69 లక్షల షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. 

జీ మీడియా కార్పొరేషన్‌: జీ గ్రూప్‌నకు చెందిన ఈ మీడియా కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7.3 శాతం దిగజారింది. రూ. 11 దిగువకు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 84,000 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 26.85 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

అగర్వాల్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌: ఈ ఇంధన రంగ లాజిస్టిక్స్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 7.2 శాతం పతనమైంది. రూ. 115కు చేరింది. తొలుత రూ. 113 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 5000 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 3400 షేర్లు మాత్రమే ట్రేయ్యాయి.