అనుహ్‌ ఫార్మా- గ్రాసిమ్‌.. భలే జోరు

అనుహ్‌ ఫార్మా- గ్రాసిమ్‌.. భలే జోరు

ముంబైలోని తయారీ ప్లాంటులో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(USFDA) విజయవంతంగా తనిఖీలు నిర్వహించినట్లు అనుహ్‌ ఫార్మా లిమిటెడ్‌ బీఎస్‌ఈకి తాజాగా తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోపక్క ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పేర్కొంది. ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం...

అనుహ్‌ ఫార్మా లిమిటెడ్‌
కంపెనీకి చెందిన తయారీ ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ చేపట్టిన తనిఖీలు విజయవంతంగా పూర్తయినట్లు బల్క్‌ డ్రగ్స్‌ తయారీ కంపెనీ అనుహ్‌ ఫార్మా లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీంతో లోపాలను సూచించే ఎలాంటి ఫామ్‌ 483 జారీ కాలేదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో అనుహ్‌ ఫార్మా షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 151 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 157ను సైతం అధిగమించింది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌(APIs), ఫార్ములేషన్స్‌ రూపొందించే అనుహ్‌ ఫార్మాలో ప్రమోటర్లకు జూన్‌కల్లా 71.78% వాటా ఉంది.  

Image result for grasim industries ltd

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఎన్‌సీడీల జారీ ద్వారా రూ. 750 కోట్లు మించకుండా సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7.6 శాతం దూసుకెళ్లి రూ. 753 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 765 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. విస్కోస్‌ స్టేపుల్‌ ఫైబర్‌, సిమెంట్‌, కెమికల్స్‌ తదితర డైవర్సిఫైడ్‌ బిజినెస్‌లు కలిగిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌లో ప్రమోటర్లకు జూన్‌కల్లా 40.15% వాటా ఉంది.