గంటలో రూ. 5 లక్షల కోట్లు ప్లస్‌

గంటలో రూ. 5 లక్షల కోట్లు ప్లస్‌

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూకుడు చూపుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఏకంగా 2,000 పాయింట్లు దూసుకెళ్లింది. గురువారం ముగింపు 36,000 నుంచి ఒక్కసారిగా 38,000కు పోల్‌వాల్ట్‌ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 1789 పాయింట్లు దూసుకెళ్లి 37,883ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 528 పాయింట్లు జంప్‌చేసి 11,233 వద్ద ట్రేడవుతోంది. గత దశాబ్ద కాలంలో మార్కెట్లు ఈ స్థాయిలో దూసుకెళ్లడం ఇదే తొలిసారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్‌, నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 37,000- 11,000 పాయింట్లను సులభంగా దాటేశాయ్‌. దీంతో ఒక్క గంటలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లలో లిస్టెడ్‌ కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ)కు రూ. 5 లక్షల కోట్లు జమయ్యాయి! 

ఆటో, బ్యాంక్స్‌ దూకుడు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 7.5-2.5 శాతం మధ్య ఎగశాయంటే కొనుగోళ్ల వెల్లువను అర్ధం చేసుకోవచ్చు. ఐటీ ఇండెక్స్‌ మాత్రమే యథాథతంగా కదులుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో రంగాలు 7.5 శాతం చొప్పున దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, బ్రిటానియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటన్‌ 13-8 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం జీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ మాత్రమే అదికూడా 4.5-0.4 శాతం మధ్య నష్టపోయాయి. ఇక డెరివేటివ్‌ కౌంటర్లలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎన్‌సీసీ, అశోక్‌ లేలాండ్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, టీవీఎస్‌ మోటార్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, జూబిలెంట్‌ ఫుడ్‌ 13-10 శాతం మధ్య దూసుకెళ్లాయి. 

మిడ్‌ క్యాప్స్‌ జోరు
మార్కెట్ల బాటలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ భారీ డిమాండ్‌ నెలకొంది. దీంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 5.4 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్‌ సైతం 3.3 శాతం ఎగసింది. స్మాల్‌ క్యాప్స్‌లో సంగమ్‌, ఎన్‌డీఎల్‌, జామ్నా, ఓమ్‌, వీటూ, రికో, రామ్‌కీ, శ్రీపుష్పక్‌, డీలింక్‌, యూఫ్లెక్స్‌, ఎన్‌ఆర్‌బీ, వీటో, శివమ్‌, కార్బోరేండమ్‌, మ్యాక్స్‌, ఎమ్‌కే, జేటీఈకేటీ తదితరాలు 14-9 శాతం మధ్య ఎగశాయి.