సెన్సెక్స్ దూకుడు- ఈ షేర్లు గెలాప్‌

సెన్సెక్స్ దూకుడు- ఈ షేర్లు గెలాప్‌

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూకుడు చూపుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఏకంగా 2,000 పాయింట్లు దూసుకెళ్లింది. గురువారం ముగింపు 36,000 నుంచి ఒక్కసారిగా 38,000కు పోల్‌వాల్ట్‌ చేసింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 560 పాయింట్లు జంప్‌చేసి 11,264ను తాకింది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వెరసి ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో ఐషర్‌ మోటార్స్‌, జామ్నా ఆటో ఇండస్ట్రీస్‌, అశోక్‌ లేలాండ్‌, శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

ఐషర్‌ మోటార్స్‌ లిమిటెడ్‌: దేశీ ఆటోమొబైల్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 17,840కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 19,488 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 6,200 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 11,200 షేర్లు ట్రేడయ్యాయి.

జామ్నా ఆటో ఇండస్ట్రీస్‌: ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 12 శాతం జంప్‌చేసింది. రూ. 40కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 1 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 2.26 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

అశోక్‌ లేలాండ్‌ లిమిటెడ్‌: ఆటోమొబైల్‌ రంగ ఈ దేశీ దిగ్గజ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 14 శాతం జంప్‌చేసింది. రూ. 66కు చేరింది. ఇంట్రాడేలో రూ. 68 సమీపానికి ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 22.5 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 37 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌: సిమెంట్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6 శాతం పురోగమించింది. రూ. 18,966కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 20,490 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 420 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1560 షేర్లు ట్రేడయ్యాయి. 

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్: ప్రయివేట్‌ రంగ ఈ బ్యాంకింగ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లింది. రూ. 375కు చేరింది. తొలుత ఒక దశలో  రూ. 378 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 9.25 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 8.9 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.