పన్నుల్లో కోత- మార్కెట్లు 'హై'జంప్‌

పన్నుల్లో కోత- మార్కెట్లు 'హై'జంప్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిచ్చే బాటలో పలు నిర్ణయాలు ప్రకటించారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి  22 శాతానికి తగ్గించారు. దీంతో దేశీ కంపెనీలకు సర్‌చార్జీ తదుపరి 25.17 శాతంగా అమలుకానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కనీస ప్రత్యామ్నాయ పన్ను(MAT)లో సైతం కోత పెట్టారు. 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా తయారీ రంగ, స్థానిక కంపెనీలను ప్రోత్సహించే బాటలో ఈ ఏడాది(అక్టోబర్‌) నుంచీ ఏర్పాటయ్యే తయారీ రంగ కంపెనీలు 15 శాతమే కార్పొరేట్‌ పన్నును చెల్లించవచ్చంటూ సీతారామన్ పేర్కొన్నారు. మినహాయింపులను పొందని కంపెనీలకు మాత్రమే పన్ను తగ్గింపులు వర్తించనున్నట్లు తెలుస్తోంది.  జులై 5 కంటే ముందుగా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన లిస్టెడ్‌ కంపెనీలకు ఉపశమనాన్ని ఇస్తూ.. బైబ్యాక్‌పై పన్ను వర్తించదని ఆర్థిక మంత్రి తెలియజేశారు. 22 శాతం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను ఎంపిక చేసుకున్న కంపెనీలకు ప్రత్యామ్నాయ పన్ను వర్తించదని వివరించారు. పన్ను తగ్గింపులు, ఇతర మినహాయింపుల కారణంగా ప్రభుత్వం వార్షికంగా రూ. 1.45 లక్షల కోట్లమేర ఆదాయాన్ని కోల్పోనున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. 

దూకుడు
ప్రస్తుతం సెన్సెక్స్‌ 1656 పాయింట్లు దూసుకెళ్లి 37,749ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 478 పాయింట్లు జంప్‌చేసి 11,183కు చేరింది. వెరసి ప్రామాణిక ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 37,000- 11,000 పాయింట్లను ఈజీగా అధిగమించాయ్‌. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. మీడియా 3.2 శాతం పతనమైంది. బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, ఫార్మా తదితరాలు 6-2 శాతం మధ్య ఎగశాయి.  గత దశాబ్ద కాలంలో మార్కెట్లు ఈ స్థాయిలో దూసుకెళ్లడం ఇదే తొలిసారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి ఒక్క గంటలో దేశీ స్టాక్‌ మార్కెట్లలో లిస్టెడ్‌ కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ)కు రూ. 5 లక్షల కోట్లు జమయ్యాయి! 

జీ మాత్రమే
నిఫ్టీ దిగ్గజాలలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు మాత్రమే వెనకడుగులో ఉంది. ఈ షేరు దాదాపు 10 శాతం పతనమైంది. కాగా.. ఇతర బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌, ఐషర్‌, ఇండస్‌ఇండ్, ఐబీ హౌసింగ్‌, మారుతీ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, హీరో మోటో, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం 5-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇక ఎఫ్‌అండ్‌వో విభాగంలో అశోక్‌ లేలాండ్‌, ఎన్‌సీసీ, శ్రీ సిమెంట్, జిందాల్‌ స్టీల్‌ 5-4 శాతం మధ్య ఎగశాయి.