రుపీ.. ప్లస్‌లో

రుపీ.. ప్లస్‌లో

డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ హుషారుగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్ మార్కెట్లో ప్రస్తుతం 26 పైసలు బలపడి 71.08 వద్ద ట్రేడవుతోంది. గురువారం స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాలు నమోదైన నేపథ్యంలో రూపాయి ఒడిదొడుకుల మధ్య స్వల్ప వెనకడుగు వేసింది. 10 పైసలు నీరసించి 71.34 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 71.37 వద్ద కనిష్టాన్ని చవిచూడగా.. 71.06 వద్ద గరిష్టాన్నీ తాకింది. కాగా.. బుధవారం(18న) మాత్రం రూపాయి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ భారీగా లాభపడింది. 54 పైసలు జంప్‌చేసి 71.24 వద్ద స్థిరపడింది. ఇదే రోజు స్టాక్‌ మార్కెట్లు తొలుత నష్టపోయినప్పటికీ చివర్లో ఊపందుకోవడం గమనార్హం! 

తొలుత నేలచూపులే
చమురు ధరల షాక్‌తో ఈ వారం తొలి రెండు రోజుల్లో దేశీ కరెన్సీ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. డాలరుతో మారకంలో సోమవారం 68 పైసలు పతనమైన రూపాయి 71.60 వద్ద ముగిసింది. ఈ బాటలో మంగళవారం సైతం మరో 18 పైసలు క్షీణించి 71.78 వద్ద స్థిరపడింది. ప్రపంచ సరఫరాల్లో 5 శాతానికి సమానమైన సౌదీ అరామ్‌కో క్షేత్రాలపై డ్రోన్‌ దాడుల కారణంగా ముడిచమురు ధరలు సోమవారం హైజంప్‌ చేశాయి. తొలుత కొత్త చరిత్ర సృష్టిస్తూ ఏకంగా 20 శాతం దూసుకెళ్లిన ధరలు చివరికి 15 శాతం లాభంతో ముగిశాయి. దీంతో స్టాక్‌ మార్కెట్లతోపాటు.. దేశీ కరెన్సీకి సైతం సెగ తగిలింది.