సెంచరీతో- ఆటో అప్‌- మీడియా వీక్

సెంచరీతో- ఆటో అప్‌- మీడియా వీక్

ముందురోజు భారీ అమ్మకాలతో కుదేలైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 121 పాయింట్లు పుంజుకుని 36,215కు చేరగా.. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 10,730 వద్ద ట్రేడవుతోంది. గురువారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో నిలవగా.. అమెరికా మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అధిక శాతం సానుకూలంగా కదులుతున్నాయి. దేశీయంగా ఆర్థిక మందగమన పరిస్థితులు కనిపిస్తుండటంతో అంతర్గతంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు.  

బ్యాంక్స్‌ మిశ్రమం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1.2-0.75 శాతం చొప్పున పుంజుకోగా.. మీడియా 2.3 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.65 శాతం చొప్పున డీలా పడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, ఐషర్, హీరో మోటో, కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్ 3.4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, కోల్‌ ఇండియా, ఐవోసీ, సిప్లా, బీపీసీఎల్‌, యాక్సిస్‌, ఎస్‌బీఐ 2-0.7 శాతం మధ్య క్షీణించాయి.

జీ పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, పిరమల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ 2-1 శాతం మధ్య బలపడగా.. ఎన్‌ఎండీసీ, హింద్‌ జింక్, జస్ట్‌ డయల్‌, అరవింద్‌, నాల్కో, రేమండ్‌, బీవోబీ 3.4-2.2 శాతం మధ్య నష్టపోయాయి. కాగా.. మీడియా కౌంటర్లలో జీ 8.5 శాతం పతనంకాగా, డెన్‌, డిష్‌ టీవీ, జీ మీడియా, సన్‌ టీవీ, టీవీ టుడే, హాథవే 5-1.3 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ మధ్య, చిన్నతరహా కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్‌ ఇండెక్సులు 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 634 నష్టపోగా.. 654 లాభాలతో కదులుతున్నాయి.