సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!

సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌?!

నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని 10,741 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లలో పావు శాతం కోతను విధించిన నేపథ్యంలో గురువారం ఉన్నట్టుండి దేశీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆర్థిక మందగమనాన్ని సంకేతిస్తూ ఆటో, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాలు కుదేలవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు  పేర్కొన్నారు. కాగా.. గురువారం ఒడిదొడుకుల మధ్య అమెరికా మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో యూరొపియన్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా నిలిచాయి. వెరసి నేడు మరోసారి మార్కెట్లు ఒడిదొడుకులకు మధ్య ట్రేడ్‌కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.   

అమ్మకాల ఫీవర్‌ 
గురువారం ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బేర్‌మన్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి పతన బాట పట్టాయి. వెరసి సెన్సెక్స్‌ 470 పాయింట్లు కోల్పోయి 36,093 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 136 పాయింట్లు పతనమై 10,705 వద్ద స్థిరపడింది. ఇటీవల ఆటో, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల అమ్మకాలు క్షీణించడంతో ఆర్థిక మందగమన భయాలు ఇన్వెస్టర్లలో తలెత్తినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,635 పాయింట్ల వద్ద, తదుపరి 10,565 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,810 పాయింట్ల వద్ద, తదుపరి 10,915 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 26,542, 26,326 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 27,074, 27,391 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 892 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 646 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 959 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 780 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.