అమ్మకాల ఫీవర్‌- నష్టాల వణుకు 

అమ్మకాల ఫీవర్‌- నష్టాల వణుకు 

అంచనాలకు అనుగుణంగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును తగ్గించినప్పటికీ ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బేర్‌మన్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి పతన బాట పట్టాయి. వెరసి సెన్సెక్స్‌ 470 పాయింట్లు కోల్పోయి 36,093 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 136 పాయింట్లు పతనమై 10,705 వద్ద స్థిరపడింది. ఇటీవల ఆటో, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల అమ్మకాలు క్షీణించడంతో ఆర్థిక మాంద్య భయాలు తిరిగి ఇన్వెస్టర్లలో తలెత్తినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

యస్‌ బ్యాంక్‌ బేర్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నీరసించగా.. మీడియా, బ్యాంక్స్‌, మెటల్‌, రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో రంగాలు 4.4-1.3 శాతం మధ్య బోర్లాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 16 శాతం కుప్పకూలగా.. జీ, ఐబీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ, ఆర్ఐఎల్‌, టెక్‌ మహీంద్రా, వేదాంతా, ఎస్‌బీఐ 8-2 శాతం మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్‌లో కేవలం టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూపీఎల్‌, ఎయిర్‌టెల్ అదికూడా 2-0.4 శాతం మధ్య బలపడ్డాయి.

ఐడియా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో రిలయన్స్‌ కేపిటల్‌, ఈక్విటాస్‌, అరవింద్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఆర్‌ఈసీ, ఎన్‌బీసీసీ 9-4.5 శాతం మధ్య పడిపోయాయి. అయితే మరోవైపు ఐడియా 12 శాతం దూసుకెళ్లగా.. ఐసీఐసీఐ ప్రు, టొరంట్‌ ఫార్మా, టాటా పవర్, ఇండిగో, గోద్రెజ్‌ సీపీ, కాల్గేట్‌ పామోలివ్‌, మదర్‌సన్‌ 2-0.8 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌, ఫీనిక్స్‌, శోభా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌ 5-1.5 శాతం మధ్య తిరోగమించాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు పతనంతో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ అమ్మకాల ఒత్తిడి నమోదైంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1780 నష్టపోగా.. 730 మాత్రమే లాభాలతో నిలిచాయి. మీడియా కౌంటర్లలో జీ, డిష్‌ టీవీ, డెన్‌, సన్‌ టీవీ, నెట్‌వర్క్‌ 18, టీవీ 18, పీవీఆర్‌, జాగరణ్‌, హాథవే 8.6-1.5 శాతం మధ్య పతనమయ్యాయి.

డీఐఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 959 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 780 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 808 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 86 కోట్ల విలువైన స్టాక్స్‌ మాత్రమే కొనుగోలు చేశాయి.