ఈ చిన్న షేర్లు.. లబోదిబో

ఈ చిన్న షేర్లు.. లబోదిబో

అంచనాలకు అనుగుణంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును పావు శాతంమేర తగ్గించిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. వారాంతాన సౌదీ అరామ్‌కోపై దాడులతో విదేశీ మార్కెట్లలో సోమవారం చమురు ధరలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. ఫలితంగా మళ్లీ దేశీ మార్కెట్లు పతన బాట పట్టాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ భారీ నష్టాలతో కళ తప్పాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో పీసీ జ్యువెలర్స్‌, రిలయన్స్‌ కేపిటల్‌, డిష్‌ టీవీ, యుకాల్‌ ఫ్యూయల్‌, ప్రెసిషన్‌ క్రామ్‌షాఫ్ట్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

పీసీ జ్యువెలర్స్‌: బంగారు ఆభరణాల తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12 శాతం కుప్పకూలింది. రూ. 38 దిగువకు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7.69 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 13.12 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

రిలయన్స్‌ కేపిటల్‌: అడాగ్‌కు చెందిన ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 8 శాతం పతనమైంది. రూ. 32.4కు చేరింది. తొలుత రూ. 31.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 24.73 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 20.7 లక్షల షేర్లు ట్రేయ్యాయి. 

డిష్‌ టీవీ: కేబుల్‌, డీటీహెచ్‌ సేవల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8 శాతం పడిపోయింది. రూ. 20 దిగువకు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 18.28 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 18.23 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ప్రెసిషన్‌ క్రామ్‌షాఫ్ట్స్‌: ఆటో విడిభాగాల ఈ కంపెనీ కౌంటర్లో కొనుగోలుదారులు కరువుకాగా.. అమ్మేవాళ్లు అధికమై ఎన్‌ఎస్ఈలో 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 31.25కు చేరింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 2,500 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 37,000 షేర్లు ట్రేడయ్యాయి. 

యుకాల్‌ ఫ్యూయల్‌ సిస్టమ్స్‌: ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 5 శాతం వెనకడుగు వేసింది. రూ. 137కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 5,200 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 3,400 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.