హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు- నష్టాల షాక్‌

హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు- నష్టాల షాక్‌

ఇటీవల కొంత కాలంగా నేలచూపులతోనే కదులుతున్న హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లలో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 52 వారాల కనిష్టాలను తాకాయి. ఇందుకు ప్రధానంగా బిజినెస్‌లలో వృద్ధి లోపించడం, ఆస్తుల(రుణాలు) నాణ్యతపై ఆందోళనలు, లిక్విడిటీ సమస్యలు వంటి ప్రతికూలతలు కారణమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

పతన  బాటలో
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్ ఫైనాన్స్‌ షేరు 9 శాతం కుప్పకూలి రూ. 383 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 381 వద్ద మూడేళ్ల కనిష్టాన్ని చవిచూసింది. ఇక ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 3 శాతం వెనకడుగుతో రూ. 379 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 376 వద్ద 5 ఏళ్ల కనిష్టానికి చేరింది. ఇదేవిధంగా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 2.3 శాతం నష్టంతో రూ. 601 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 594 వద్ద చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. 2016 నవంబర్‌లో లిస్టయ్యాక ఇదే కనిష్టంకావడం గమనార్హం! ఈ బాటలో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4 శాతం క్షీణించి రూ. 47కు చేరగా.. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ సైతం 4.5 శాతం తిరొగమించి రూ. 5.35కు చేరింది. ఇది సరికొత్త కనిష్టంకావడం గమనార్హం. కాగా.. గత రెండు నెలల్లో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 27 శాతం పతనంకాగా.. పీఎన్‌బీ హౌసింగ్‌ కౌంటర్‌ సైతం 19 శాతం తిరోగమించింది.