కుప్పకూలిన యస్‌ బ్యాంక్‌.. జీ

కుప్పకూలిన యస్‌ బ్యాంక్‌.. జీ

ప్రమోటర్ గ్రూప్‌ కంపెనీకి చెందిన మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్‌సీడీల) రేటింగ్‌ను.. కేర్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన వార్తలతో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క తనఖాలోలేని షేర్లను విక్రయించకుండా గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్ చంద్రను ఆర్బిట్రేటర్‌ నిలువరించినట్లు వెలువడిన వార్తలు మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి ఈ రెండు ఇండెక్స్‌ కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. 

యస్ బ్యాంక్‌ లిమిటెడ్‌
ప్రమోటర్‌ గ్రూప్‌లోని మోర్గాన్‌ క్రెడిట్స్‌ జారీ చేసిన ఎన్‌సీడీల రేటింగ్‌ను A- నుంచి కేర్‌ రేటింగ్స్‌ తాజాగా BBB-కు సవరించినట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. యస్ బ్యాంక్‌లో మోర్గాన్‌ క్రెడిట్స్‌ 3.03 శాతం వాటాను కలిగి ఉంది. బ్యాంకు షేర్ల ధరలు పతనమైన నేపథ్యంలో ఎంసీపీఎల్‌, తదితర ప్రమోటర్ల వద్ద గల వాటా విలువ పడిపోవడంతో రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేపట్టినట్లు కేర్‌ రేటింగ్స్‌ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యస్‌ బ్యాంక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12 శాతం కుప్పకూలింది. రూ. 56 వద్ద ట్రేడవుతోంది. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
వచ్చే నెల 16వరకూ తనఖాలోలేని షేర్లను విక్రయించవద్దంటూ ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్రను ఆర్బిట్రేటర్‌ ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆర్బిట్రేటర్‌ను ఢిల్లీ హైకోర్టు నియమించింది. కాగా.. ఈ నెల 30న ముగియనున్న గడువును పొడిగించమంటూ ఎంఎఫ్‌ రుణదాతలను జీ ప్రమోటర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి సైతం తీసుకోవలసి ఉండటంతో రుణదాతల నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లభించలేదని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం పతనమైంది. రూ. 309 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 306 వరకూ నీరసించింది.