మార్కెట్ల పతనం- అన్ని రంగాలూ

మార్కెట్ల పతనం- అన్ని రంగాలూ

ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు బేర్‌మంటున్నాయి. అంచనాలకు అనుగుణంగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి పతన బాట పట్టాయి. ఇన్వెస్టర్లకు అమ్మకాలకు ఎగబడుతుండటంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 423 పాయింట్లు కోల్పోయి 36,141కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 125 పాయింట్లు పతనమై 10,716 వద్ద ట్రేడవుతోంది. అంచనాలకు అనుగుణంగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పావు శాతంమేర తగ్గించిన నేపథ్యంలో బుధవారం అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా నిలవగా.. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి నమోదైంది. 

బ్యాంక్స్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ డీలాపడగా.. మీడియా, మెటల్‌, బ్యాంక్స్‌, ఐటీ, ఫార్మా రంగాలు 3.6-1.5 శాతం మధ్య బోర్లాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 10 శాతం పతనంకాగా, జీ, టాటా స్టీల్, వేదాంతా, ఐబీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌ 6-2 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో కేవలం టాటా మోటార్స్‌, ఎయిర్‌టెల్, బ్రిటానియా, ఏషియన్‌ పెయింట్స్ అదికూడా 1.5-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి.

ఐడియా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో రిలయన్స్‌ కేపిటల్‌, డిష్‌ టీవీ, ఆర్‌ఈసీ, ఈక్విటాస్‌, ఎన్‌బీసీసీ, సెయిల్‌, ఎన్‌సీసీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 7-4.5 శాతం మధ్య పడిపోయాయి. అయితే మరోవైపు ఐడియా 13 శాతం దూసుకెళ్లగా.. ఐసీఐసీఐ ప్రు, టొరంట్‌ ఫార్మా, దివాన్‌ హౌసింగ్‌, నిట్‌ టెక్‌, కాల్గేట్‌ పామోలివ్‌ 2.5-1 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌, ఫీనిక్స్‌, శోభా, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌ 4.5-1.5 శాతం మధ్య తిరోగమించాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాల బాట పట్టడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1601 నష్టపోగా.. 615 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. మీడియా కౌంటర్లలో జీ, డిష్‌ టీవీ, డెన్‌, ఈరోస్, హాథవే, సన్‌ టీవీ, నెట్‌వర్క్‌ 18, టీవీ 18, పీవీఆర్‌ 6-2 శాతం మధ్య పతనమయ్యాయి.