ప్లాస్టిక్‌కు చెక్‌- పేపర్‌ షేర్ల పరుగు

ప్లాస్టిక్‌కు చెక్‌- పేపర్‌ షేర్ల పరుగు

పర్యావరణ పరిరక్షణకుగాను దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలన్న డిమాండ్ల నేపథ్యంలో పేపర్, జూట్‌ ప్రొడక్టుల తయారీ కంపెనీలు వరుసగా రెండో రోజు వెలుగులో నిలుస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు పేపర్‌ తయారీ కంపెనీల కౌంటర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను దేశవ్యాప్తంగా నిషేధించనున్న వార్తలు ఈ కౌంటర్లకు కొద్ది రోజులుగా జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ కవర్లు, కప్పులు, చిన్న బాటిళ్లు, స్ట్రాలు, సాచెట్స్‌ తదితరాల వినియోగాన్ని వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసేందుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

జోరుగా- హుషారుగా..
ఇటీవల జోరందుకున్న పేపర్‌, జూట్‌ ప్రొడక్టుల కంపెనీల షేర్లకు మరోసారి డిమాండ్‌ నెలకొంది. దీంతో నష్టాల మార్కెట్లోనూ పలు పేపర్‌ కంపెనీల షేర్లు లాభాల పరుగందుకున్నాయి. జాబితాలో మలు పేపర్‌, స్టార్‌ పేపర్, ఇమామీ, ఓరియంట్‌, జేకే, శేషసాయి, వెస్ట్‌ కోస్ట్, టీఎన్‌పీఎల్‌ తదితరాలున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో లడ్లో జూట్‌ అండ్‌ స్పెషాలిటీస్‌ 8 శాతం జంప్‌చేసి రూ. 103ను తాకగా.. ఎన్‌ఎస్‌ఈలో మలు పేపర్‌ మిల్స్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 31కు చేరింది. ఈ బాటలో ఓరియంట్‌ పేపర్‌ 4.4 శాతం ఎగసి రూ. 31 వద్ద, స్టార్‌ పేపర్‌ 4 శాతం జంప్‌చేసి రూ. 143 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో స్టార్‌ పేపర్‌ రూ. 147కు ఎగసింది. ఇదేవిధంగా వెస్ట్‌ కోస్ట్‌ 4 శాతం పురోగమించి రూ. 268 వద్ద కదులుతోంది. తొలుత రూ. 274కు జంప్‌చేసింది. ఇక శేషసాయి 2.3 శాతం బలపడి రూ. 209 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 224 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Image result for Paper & paper products

లాభాల్లో
పేపర్‌ తయారీ ఇతర కౌంటర్లలో రుచిరా 2.4 శాతం పుంజుకుని రూ. 101 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత రూ. 105 వరకూ పెరిగింది. ఇదే విధంగా జేకే పేపర్‌ 4 శాతం జంప్‌చేసి రూ. 134ను తాకింది. ఇంట్రాడేలో రూ. 137కు చేరింది. ఇమామీ పేపర్‌ 5 శాతం ఎగసి రూ. 96కు చేరగా.. టీఎన్‌పీఎల్‌ 1.4 శాతం లాభంతో రూ. 193 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 198ను అధిగమించింది. ఎన్‌ఆర్‌ అగర్వాల్‌ 2 శాతం లాభపడి రూ. 262 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 275కు చేరింది. కాగా.. బీఎస్‌ఈలో చెవియట్‌ కంపెనీ 3 శాతం ఎగసి రూ. 762కు చేరింది. ఇంట్రాడేలో రూ. 787ను తాకింది. స్ట్రన్‌ పేపర్‌ సైతం 2.5 శాతం పుంజుకుని రూ. 114 వద్ద, శ్రేయన్స్‌ 4 శాతం జంప్‌చేసి రూ. 141 వద్ద ట్రేడవుతోంది.