ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌.. లిస్టింగ్‌ భేష్‌

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌.. లిస్టింగ్‌ భేష్‌

పీఈ దిగ్గజం ఫెయిర్‌ఫాక్స్‌ పెట్టుబడులున్న ఐఐఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లాభాలతో లిస్టయ్యింది. తదుపరి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మరింత జోరందుకుంది. కాగా.. మరోపక్క లంప్స్‌, ఫైన్స్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మైనింగ్‌ రంగ పీఎస్‌యూ కంపెనీ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ కౌంటర్ లాభాలతో సందడి చేస్తోంటే.. ఎన్‌ఎండీసీ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

ఐఐఎఫ్‌ఎంల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌
ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌(గతంలో హోల్డింగ్స్‌) నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన ఐఐఎఫ్‌ఎంల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో అంచనాల కంటే అధిక ధరలో లిస్టయ్యింది. పలు బ్రోకింగ్‌ సంస్థలు రూ. 1050-800 మధ్యలో సరైన విలువగా భావించినప్పటికీ ఎన్‌ఎస్ఈలో ఐఐఎఫ్‌ఎంల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ షేరు రూ. 1210 వద్ద లిస్టయ్యింది. తదుపరి అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం రూ. 1270 వద్ద ఫ్రీజయ్యింది. ఈ ఏడాది మార్చిలో ఐఐఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ డీమెర్జర్‌ పథకానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. దీనిలో భాగంగా ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ వాటాదారులకు ప్రతీ 7 షేర్లకుగాను 1 ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ షేరుని కేటాయించారు.

Image result for nmdc limited

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌
ఇనుపఖనిజ ప్రొడక్టులు లంప్స్‌, ఫైన్స్‌ ధరలలో కోత పెడుతున్నట్లు ప్రభుత్వ  రంగ మైనింగ్‌ దిగ్గజం ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. లంప్స్‌, ఫైన్స్‌ ధరలను టన్నుకి రూ. 200 చొప్పున తగ్గిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో లంప్స్‌ ధరలు టన్నుకి రూ. 2,700కు చేరగా.. ఫైన్స్‌ ధరలు రూ. 2460ను తాకినట్లు వెల్లడించింది. కాగా.. ఆగస్ట్‌లోనూ ఎన్‌ఎండీసీ లంప్స్‌, ఫైన్స్‌ ధరలను టన్నుకి రూ. 200 చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో కంపెనీ ఉత్పత్తి 3.4 శాతం క్షీణించి 1.41 మిలియన్‌ టన్నులకు పరిమితంకాగా.. అమ్మకాలు మరింత అధికంగా 36 శాతం పడిపోయి 1.49 మిలియన్‌ టన్నులకు నీరసించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎన్‌ఎండీసీ షేరు 2.5 శాతం నష్టంతో రూ. 85 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 84 దిగువకూ చేరింది.