ఫెడ్‌ వడ్డీ రేటు తగ్గింది..!

ఫెడ్‌ వడ్డీ రేటు తగ్గింది..!

అంచనాలకు తగ్గట్లుగానే అమెరికన్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాదిలో వరుసగా రెండోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టింది. బుధవారం ముగిసిన రెండు రోజుల పాలసీ సమీక్షలో భాగంగా ఫండ్స్‌ రేట్లలో 0.25 శాతంమేర కోత పెట్టింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు ప్రస్తుతం 1.75-2 శాతానికి దిగి వచ్చాయి. కాగా.. ఆర్థిక వ్యవస్థ, ఉపాధి మార్కెట్లలో వృద్ధి కొనసాగే వీలున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకే మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలియజేశారు. వాణిజ్య వివాదాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం వంటి సంకేతాలు దీనికి కారణమని వివరించారు. 

అవసరమైతే..
భవిష్యత్‌లో ఒకవేళ ఆర్థిక వ్యవస్థ నీరసిస్తే.. మరింత వేగంగా రేట్ల కోత ఉండవచ్చని పావెల్‌ సంకేతాలిచ్చారు. ఇదే విధంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది కొనసాగితే ఇకపై రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చన్న సంకేతాలు సైతం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం చెలరేగాక 2008 తదుపరి అంటే 11 ఏళ్ల తదుపరి తొలిసారి జులైలో ఫెడ్‌ వడ్డీ రేట్లలో కోత విధించిన విషయం విదితమే. కాగా.. ఫెడ్‌ వడ్డీ రేటు తగ్గింపు నేపథ్యంలో 10ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1.75 శాతానికి పుంజుకోగా.. డాలరుతో మారకంలో జపనీస్‌ కరెన్సీ యెన్‌ ఏడు వారాల కనిష్టం 108.47కు చేరింది.