నష్టాల బాట.. బ్యాంక్స్‌, ఐటీ వీక్

నష్టాల బాట.. బ్యాంక్స్‌, ఐటీ వీక్

అంచనాలకు అనుగుణంగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును తగ్గించిన నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లకు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో నష్టాల బాటలో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 206 పాయింట్లు క్షీణించి 36,358కు చేరగా.. నిఫ్టీ 65 పాయింట్ల వెనకడుగుతో 10,776 వద్ద ట్రేడవుతోంది. బుధవారం అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా నిలవగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. 

ఆటో ఎదురీత
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్స్‌, ఐటీ, మెటల్‌, ఫార్మా రంగాలు 1-0.6 శాతం మధ్య డీలాపడగా.. ఆటో 0.4 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, జీ, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, టెక్‌ మహీంద్రా, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌ టెక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌ 5-1.4 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్‌, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్, ఎయిర్‌టెల్,  బీపీసీఎల్‌, హెచ్‌యూఎల్‌ 1-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి.

ఐడియా జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో టాటా గ్లోబల్‌, ఎన్‌ఎండీసీ, ఎన్‌బీసీసీ, ఆర్‌ఈసీ, సెయిల్‌ 3.4-2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు ఐడియా 10 శాతం జంప్‌చేయగా, దివాన్‌ హౌసింగ్‌, నాల్కో, రిలయన్స్ ఇన్‌ఫ్రా, గోద్రెజ్‌ సీపీ, ఇంజినీర్స్‌, ఐసీఐసీఐ ప్రు 3.4-1 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాల బాటలో ప్రారంభంకావడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్‌ ఇండెక్సులు 0.25 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 850 నష్టపోగా.. 583 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.