జోష్‌లో మైండ్‌ట్రీ- టాటా కమ్‌

జోష్‌లో మైండ్‌ట్రీ- టాటా కమ్‌

మర్చంట్‌ ఆన్‌బోర్డింగ్‌ సొల్యూషన్స్‌ ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారిత మర్చంట్‌ ఆన్‌బోర్డింగ్‌ సేవలకు బ్యాంకింగ్‌ పరిశ్రమ నుంచి డిమాండ్‌ లభించగలదని కంపెనీ పేర్కొంది. కాగా.. మరోపక్క స్పెయిన్‌లో నెట్‌వర్క్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సంబంధ సేవలందించేందుకు విదేశీ సంస్థతో చేతులు కలిపినట్లు పేర్కొనడంతో టాటా కమ్యూనికేషన్స్‌ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

మైండ్‌ట్రీ లిమిటెడ్‌
కొత్తగా ఆవిష్కరించిన బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ద్వారా క్రెడిట్‌ కార్డ్స్‌ లేదా డెబిట్‌ కార్డ్స్‌ చెల్లింపులను మరింత సమర్ధవంతంగా వేగవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని మైండ్‌ట్రీ పేర్కొంది. అంతేకాకుండా ఇన్నోయాప్‌ క్యుబర్‌నెటిస్‌ పేరుతో రూపొందించిన టెక్నాలజీ సర్వీసుల ద్వారా కంపెనీలు కంటెయినరైజ్‌డ్‌ క్లౌడ్‌ అప్లికేషన్స్‌ను వినియోగించుకోవచ్చని తెలియజేసింది. మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌ ద్వారా కంటెయినరైజ్‌డ్‌ క్లౌండ్‌ అప్లికేషన్స్‌ సేవలు పొందవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో మైండ్‌ట్రీ లిమిటెడ్‌ షేరు 3 శాతం ఎగసి రూ. 702 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 712 వరకూ జంప్‌చేసింది.

Image result for tata communications ltd

టాటా కమ్యూనికేషన్స్‌
విదేశీ సంస్థ కనెక్టా వైర్‌లైస్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగస్వామిగా ఎంపికైనట్లు టాటా కమ్యూనికేషన్స్‌ తాజాగా పేర్కొంది. ఈ భాగస్వామ్యం ద్వారా సంయుక్తంగా స్పెయిన్‌లో నెట్‌వర్క్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌, బిజినెస్‌ కొలాబరేషన్‌ సర్వీసులను అత్యుత్తమ స్థాయిలో అందించనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ఫలితంగా కొత్త ప్రొడక్టులు, బిజినెస్‌ విధానాల ద్వారా మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో టాటా కమ్యూనికేషన్స్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 292 వద్ద ట్రేడవుతోంది. జూన్‌ కల్లా టాటా కమ్యూనికేషన్స్‌లో ప్రమోటర్లకు 74.99 % వాటా ఉంది.