డీమార్ట్‌ జోరు- గ్లెన్‌మార్క్‌ డీలా

డీమార్ట్‌ జోరు- గ్లెన్‌మార్క్‌ డీలా

ఇటీవల కొద్ది రోజుల నుంచీ పటిష్టంగా కదులుతున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ షేరు చరిత్రాత్మక గరిష్టానికి చేరువైంది. కాగా.. మరోపక్క కంపెనీ ఔట్‌లుక్‌ను గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌(ఎస్‌అండ్‌పీ) డౌన్‌గ్రేడ్‌ చేయడంతో హెల్త్‌కేర్‌ రంగ దేశీ కంపెనీ గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌ లాభాలతో సందడి చేస్తుంటే.. గ్లెన్‌మార్క్‌ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..  

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్
గత మూడు నెలల్లో 26 శాతం లాభపడిన డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు తాజాగా జోరు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 2.2 శాతం పెరిగి రూ. 1637 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1650 వరకూ ఎగసింది. తద్వారా గతేడాది డిసెంబర్‌లో నమోదైన రికార్డ్‌ గరిష్టం రూ. 1699కు చేరువైంది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ) రూ.1.02 లక్షల కోట్లను మళ్లీ అధిగమించింది. రూ. 200 కోట్ల ఎన్‌సీడీలకు క్రిసిల్‌ స్థిరత్వంతో కూడిన AA+ రేటింగ్‌ను ప్రకటించాక గత 10 రోజుల్లో డీమార్ట్‌ షేరు 9 శాతం పుంజుకుంది. కాగా.. నిర్వహణ లాభాలను నిలబెట్టుకోవడం, కొత్త స్టోర్లకు త్వరగా బ్రేక్‌ఈవెన్‌ సాధించడం వంటి సానుకూల అంశాలను ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ రేటింగ్‌ సవరణలో పరిగణించినట్లు క్రిసిల్‌ పేర్కొంది. 

Image result for glenmark pharmaceuticals

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌
బలహీన పనితీరు, 2021లో గడువు తీరనున్న సెక్యూరిటీల రీఫైనాన్సింగ్ రిస్కుల నేపథ్యంలో గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఔట్‌లుక్‌ను ప్రతికూలానికి(నెగిటివ్‌) సవరించినట్లు విదేశీ సంస్థ ఎస్‌అండ్‌పీ తాజాగా పేర్కొంది. పెట్టుబడుల వ్యయాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫ్రీ క్యాష్‌ ఫ్లో నమోదయ్యే అవకాశాలు తక్కువేనని ఎస్‌అండ్‌పీ అభిప్రాయపడింది. దీంతో BB- రేటింగ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్లెన్‌మార్క్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.4 శాతం క్షీణించి రూ. 362 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 360 వరకూ వెనకడుగు వేసింది.