ఈ షేర్లు.. పతనంలో ఫాస్ట్‌

ఈ షేర్లు.. పతనంలో ఫాస్ట్‌

ముడిచమురు ధరలు వరుసగా రెండో రోజు మంట పుట్టిస్తున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. వారాంతాన సౌదీ అరామ్‌కోపై దాడులతో విదేశీ మార్కెట్లలో సోమవారం చమురు ధరలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. ఫలితంగా మళ్లీ దేశీ మార్కెట్లు పతన బాట పట్టాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ భారీ నష్టాలతో కళ తప్పాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో హెచ్‌ఈజీ లిమిటెడ్‌, గ్రాఫైట్‌ ఇండియా లిమిటెడ్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీడీసీ లిమిటెడ్‌, అగ్రి-టెక్‌ ఇండియా లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

హెచ్‌ఈజీ లిమిటెడ్‌: గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం కుప్పకూలింది. రూ. 1261కు చేరింది. ఇంట్రాడేలో రూ. 1246 వద్ద కనిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 53,000 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 3.57 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

రిలయన్స్ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌: ప్రయివేట్‌ రంగ ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 8 శాతం పతనమైంది. రూ. 229కు చేరింది. తొలుత రూ. 221 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 99,000 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 3.1 లక్షల షేర్లు ట్రేయ్యాయి. 

గ్రాఫైట్‌ ఇండియా లిమిటెడ్‌: గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 9.3 శాతం పడిపోయింది. రూ. 337కు చేరింది. ఇంట్రాడేలో రూ. 334 వరకూ నీరసించింది.ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 2.5 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 11.5 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఐటీడీసీ లిమిటెడ్‌: ఆతిథ్య రంగ ఈ కంపెనీ కౌంటర్లో కొనుగోలుదారులు కరువుకాగా.. అమ్మేవాళ్లు అధికమై ఎన్‌ఎస్ఈలో 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 250కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 14,300 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 17,500 షేర్లు ట్రేడయ్యాయి. 

అగ్రి-టెక్‌ ఇండియా లిమిటెడ్‌: వ్యవసాయ సంబంధ బిజినెస్‌ నిర్వహించే ఈ కంపెనీ కౌంటర్లో అమ్మేవాళ్లు అధికమై 10 శాతం దిగజారింది. ఎన్‌ఎస్ఈలో రూ. 51కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 400 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 260 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.